
- 2015లో ఇంట్లో చనిపోయిన వ్యక్తి.. ఇన్నాళ్లూ ఎవరూ గుర్తించలే!
- క్రికెట్‌బాల్ కోసం వెళ్లి గుర్తించిన స్థానిక పిల్లలు
- హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఘటన
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌లోని ఓ పాడుబడ్డ ఇంట్లో అస్తి పంజరం కలకలం రేపింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేండ్ల కింద చనిపోయిన వ్యక్తి అస్తి పంజరమని పోలీసులు గుర్తించారు. ఒంటరిగా ఉండడం, బంధువులు పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి చనిపోయిన సంగతి చుట్టుపక్కల వారికి ఎవరికీ తెలియలేదు. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో సోమవారం కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు కొట్టిన బాల్అక్కడి పాడుబడ్డ ఇంట్లో పడింది. వారు లోపలికి వెళ్లి చూడగా.. అస్తిపంజరం కనిపించింది. వెంటనే ఆ పిల్లలు స్థానికులకు చెప్పారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని, విచారణ చేపట్టారు. అది అమీర్ ఖాన్(50) అనే వ్యక్తి అస్తిపంజరమని గుర్తించారు. అతడికి పెండ్లి కాలేదని, ఒంటరిగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారన్నారు. అమీర్ ఖాన్‌కు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నారని, వారంతా నగరంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నారని పేర్కొన్నారు. అతని వద్దకు ఎవరూ రావడం లేదని, చనిపోయిన విషయం కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. సంఘటన స్థలంలో ఒక సిచ్ఛాఫ్అయిన సెల్ ఫోన్దొరికిందని, అమీర్‌ఖాన్2015 లో చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చామని పోలీసులు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.