కొత్త కోర్సులకు ముందుకు రాని ప్రైవేటు, సర్కారు డిగ్రీ కాలేజీలు

కొత్త కోర్సులకు ముందుకు రాని ప్రైవేటు, సర్కారు డిగ్రీ కాలేజీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కొత్తగా ప్రారంభిస్తున్న స్కిల్  కోర్సులకు మేనేజ్ మెంట్ల నుంచి ఆదరణ కరువైంది. ఆ కోర్సులు అందించేందుకు ప్రైవేటుతో పాటు సర్కారు కాలేజీలు కూడా ముందుకు రావడం లేదు. స్కిల్  కోర్సుల్లో చేరితే నెలకు రూ.10 వేలు కూడా స్టూడెంట్లకు రానున్నది. అయినా ఆ కోర్సుల్లో చేరితే భవిష్యత్తులో పైచదువులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని మేనేజ్ మెంట్లు ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఉన్నత విద్యా మండలి ఎంపిక చేసిన కాలేజీలు కూడా ఆ కోర్సులు అందించేందుకు ముందుకు రావడం లేదు. డిగ్రీ కాలేజీల్లో స్కిల్  కోర్సులు ప్రారంభించాలని హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  నిర్ణయించింది. ఇందులో భాగంగా 103 కాలేజీలను ఎంపిక చేసింది. వాటిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్కిల్  ఇండియా స్కీమ్​లో భాగంగా స్కిల్  డెవలప్​మెంట్ అండ్  ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌‌‌  కింద మొత్తం పది కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. వాటిలో ప్రధానంగా బీబీఏ రిటైలింగ్, బీఎస్సీ ఫిజికల్  సైన్స్, ఈ కామర్స్ ఆపరేషన్స్, బీఏ కంటెంట్ అండ్  క్రియేటివ్  రైటింగ్, లాజిస్టిక్స్, హాస్పిటల్  మేనేజ్ మెంట్  తదితర కోర్సులు ఉన్నాయి. అయితే, ఎంపిక చేసిన కాలేజీలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ కోర్సుల గురించి ప్రకటన రాగానే జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ, మేనేజ్ మెంట్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కౌన్సిల్  ఎంపిక చేసిన 103 డిగ్రీ కాలేజీల్లో రెండో వంతు ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. అయితే, 66  ప్రైవేటు కాలేజీలను ఎంపిక చేస్తే 13  కాలేజీలు, 37  సర్కారు కాలేజీలను ఎంపిక చేస్తే 21 కాలేజీలు మాత్రమే స్కిల్   కోర్సుల కోసం అప్లై చేశాయి. దీంతో ఏం చేయాలో  కౌన్సిల్ అధికారులు అయోమయంలో పడ్డారు. 

పీజీ కోర్సుల్లో అవకాశంపై గందరగోళం

డిగ్రీలో స్కిల్  కోర్సుల్లో చేరితే మూడు రోజులు చదువు, మరో మూడు రోజులు అప్రెంటిస్‌‌‌‌షిప్  చేయాల్సి ఉంటుంది. 15 రోజులు అప్రెంటిస్ షిప్  చేస్తే స్టూడెంట్లకు రూ.10 వేలు అందిస్తారు. అయితే, ఈ కోర్సులపై మేనేజ్ మెంట్లలో అయోమయం మొదలైంది. ఈ కోర్సులు చదివిన తర్వాత స్టూడెంట్లు ఏఏ పీజీ కోర్సులకు అర్హులనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎంబీఏ మాత్రమే చేసే అవకాశం ఉంది. మరోపక్క ఎంఏ తెలుగు/ఇంగ్లిష్  చేసుకునే  చాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నా, దానిపై స్పష్టత లేదు. దీంతో ఆ కోర్సులను పెడితే ఎవరూ రారని మేనేజ్ మెంట్లు ఆందోళన చెందుతున్నాయి. కాగా, ఈ కోర్సులు డిగ్రీ వరకే చదివి ఆపేసే వారికి  ఎక్కువగా ఉపయోగపడతాయని ఓ ప్రైవేటు మేనేజ్ మెంట్  ప్రతినిధి తెలిపారు. దీనిపై ఉన్నత విద్యా మండలి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.