ఫిబ్రవరి 23న రైతు సంఘాల ‘బ్లాక్ డే’

 ఫిబ్రవరి 23న రైతు సంఘాల ‘బ్లాక్ డే’
  •      నిరసనల్లో రైతు మృతి ఘటనపై..మర్డర్ కేసు నమోదు చెయ్యాలె
  •     మార్చి 14న ఢిల్లీలో మహా పంచాయత్ కు నిర్ణయం 

న్యూఢిల్లీ: పంజాబ్-–హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతూ పోలీసుల కాల్పుల్లో రైతు మృతి చెందిన ఘటనపై మర్డర్ కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎమ్) గురువారం డిమాండ్ చేసింది. బుధవారం పంజాబ్‌‌ సంగ్రూర్ జిల్లాలోని ఖనౌరీ బార్డర్ పాయింట్ లో హర్యానా పోలీసులు, పంజాబ్ రైతుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో శుభకరణ్ సింగ్ (21)  అనే యువ రైతు మరణించగా, 12 మంది గాయపడ్డారు. రైతు మృతిని ఎస్ కేఎమ్ ఖండించింది. అతడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ చలో మార్చ్ లో భాగంగా శంభు, ఖనౌరీ బార్డర్ లో వేలాది మంది రైతులు క్యాంపులు ఏర్పాటు చేశారు. 

ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితిపై చర్చించడానికి గురువారం ఎస్ కేఎమ్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం బ్లాక్ డేగా పాటించాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హర్యానా మంత్రి అనిల్ విజ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా హైవేలపై ఫిబ్రవరి 26న రైతులు ట్రాక్టర్ మార్చ్ లు నిర్వహిస్తారని పేర్కొంది. మార్చి 14న ఢిల్లీలో మహాపంచాయత్ ను చేపడుతారని తెలిపింది. ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఎత్తివేత, ఇతర డిమాండ్లతో రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ కు ఎస్ కేఎమ్, కిసాన్ మజ్దూర్ సంఘ్ నాయకత్వం వహిస్తున్నాయి.