బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 వేదికగా సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SKV) రాష్ట్ర ప్రభుత్వంతో కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో ఒక సమగ్ర టౌన్‌షిప్, అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోను నిర్మించనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ స్థాయి సౌకర్యాలు
ఈ కీలకమైన ఒప్పందంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్, మీడియా రంగంలోకి సల్మాన్ అడుగుపెడుతున్నారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో టౌన్‌షిప్, నివాస, వాణిజ్య, వినోద, క్రీడా సౌకర్యాలను ఒకే చోట అందిస్తూ, సరికొత్తగా నగర జీవనాన్ని రూపొందించనున్నారు. ఈ టౌన్‌షిప్‌లో అత్యుత్తమ క్రీడా సౌకర్యాలకు పెద్ద పీట వేశారు. ఇందులో ఛాంపియన్‌షిప్ స్థాయి గోల్ఫ్ కోర్స్, రేస్ కోర్స్, షూటింగ్ రేంజ్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు ఏర్పాటు కానున్నాయి.
వీటితో పాటు, అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య భాగం కానుంది. ఇది తెలంగాణను మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణాలకు కీలక కేంద్రంగా నిలపనుంది. ఈ స్టూడియోతో ప్రాంతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌తో పాటు, సినీ పరిశ్రమకు కూడా భారీ ఊతం లభించనుంది.. దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులను ఆకర్షించేలా పెద్ద ఎత్తున సెట్‌లు, పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలను అందించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ సహకారం
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ పెట్టుబడి రాష్ట్ర సృజనాత్మక రంగానికి ఒక గొప్ప మైలురాయి అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడంతో పాటు, తెలంగాణను ఫిల్మ్ మేకింగ్, వినోదం, లగ్జరీ పర్యాటకానికి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలపనుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
►ALSO READ | H-1B, H-4 వీసాదారులకు కొత్త చిక్కులు: వీసా ఇంటర్వ్యూలు రద్దు.. ఎందుకంటే..?
ప్రభుత్వం తరఫున భూమి , ఫ్రేమ్‌వర్క్‌లు, మౌలిక సదుపాయాల కనెక్టివిటీ వంటి అంశాలపై SKV ప్రతినిధులు, ప్రభుత్వ బృందం చర్చించింది. అన్ని రకాల అనుమతులు, కనెక్టివిటీ , వ్యవస్థ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సమగ్ర విధానం ద్వారా గ్లోబల్ ఫిల్మ్ ప్రాజెక్టులకు వేదికగా నిలవడంతో పాటు, ప్రధాన పర్యాటక కేంద్రంగా ఎదిగేందుకు ఈ క్రియేటివ్ అండ్ లైఫ్‌స్టైల్ డిస్ట్రిక్ట్ దోహదపడుతుందన్నారు. సల్మాన్ ఖాన్ తన బ్రాండ్‌ను సంప్రదాయ సినీ నిర్మాణానికి మించి విస్తరిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ లక్ష్యాలకు, ఆర్థిక వృద్ధికి, పర్యాటక ఆకర్షణకు అపారమైన మద్దతు ఇస్తుందని SKV విశ్వసిస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్యాటిల్ ఆఫ్ గాల్వన్' సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రం టీజర్ డిసెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి,.

