
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పనుల పునరుద్ధరణపై రిపోర్టు తయారుచేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు
- ఈ నెల 15న కేబినెట్లో చర్చించి.. పనులు మొదలుపెడ్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, అందుకు తగ్గట్టుగా రూట్‌మ్యాప్ రూపొందించామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పారు. హైలెవెల్ కెనాల్ నుంచి లో లెవెల్ కెనాల్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే.. ప్రస్తుతం నీటి సరఫరాకు నెలనెలా చెల్లిస్తున్న రూ.కోటికిపైగా విద్యుత్ భారం నుంచి బయటపడతామన్నారు. మంగళవారం ఆయన జలసౌధలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.
ఈ రివ్యూలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బాలూ నాయక్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేలు, ఇరిగేషన్ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల పునరుద్ధరణకు హెలికాప్టర్ సర్వే చేయిస్తామన్నారు.
దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులను రిపోర్టు తయారు చేయాల్సిందిగా ఆదేశించామని, ఆ రిపోర్టుపై ఈ నెల 15న నిర్వహించే కేబినెట్లో చర్చిస్తామని పేర్కొన్నారు. మంత్రివర్గ ఆమోదంతో పనులు మొదలుపెడతామని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా టన్నెల్ 1, టన్నెల్ 2, పెండ్లిపాకల రిజర్వాయర్లను పూర్తి చేసి.. 25 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ ద్వారా హైలెవెల్ కెనాల్‌కు లింక్ చేస్తామన్నారు. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే.. హైలెవెల్ కెనాల్ ద్వారా 2.2 లక్షల ఎకరాలు, ఉదయ సముద్రం ద్వారా లక్ష ఎకరాలు, లో లెవెల్ కెనాల్ ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.
డిండితో 3.61 లక్షల ఎకరాలకు నీళ్లు
డిండి లిఫ్ట్‌ను పూర్తి చేసి 3.61 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సింగరాయపల్లి రిజర్వాయర్ ద్వారా 13 వేల ఎకరాలు, ఎర్రబెల్లి -గోకారం ద్వారా 6 వేల ఎకరాలు, ఇర్శిన్ ద్వారా 10 వేల ఎకరాలు, గొట్టిముక్కల ద్వారా 28 వేల ఎకరాలు, చింతపల్లి ద్వారా 15 వేల ఎకరాలు, కృష్ణరాంపల్లి ద్వారా లక్ష ఎకరాలు, శివన్నగూడెం ద్వారా లక్షా 55 వేల ఎకరాలకు సాగునీళ్లందించేందుకు పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి దుందుభి వాగు వరకు నీటిని రప్పించేందుకు ఐదు ప్యాకేజీలుగా పనులు ప్రారంభించామన్నారు. అయితే, అటవీశాఖ అనుమతులు, ఇతర కారణాలతో నిలిచిపోయిన చింతపల్లి, ఇర్శిన్ రిజర్వాయర్ల పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హెడ్ రీచ్ నుంచి కాలువల నిర్మణాలకు త్వరగా సర్వే పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన ఉదయ సముద్రం పనులు ఇప్పటికే 70 శాతం పూర్తి కాగా మిగిలిన పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించమన్నారు. ఉదయ సముద్రం పరిధిలోని బ్రాహ్మణవెళ్ళేంల రిజర్వవాయర్ పూర్తి అయిందని కెనాల్ నెట్ వర్క్ పనులు నడుస్తున్నాయన్నారు. పెండింగ్ లో ఉన్న పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాలువలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 93 శాతం పూర్తయ్యాయన్నారు. గంధమళ్ల రిజర్వాయర్ పరిధిలోని రావెల్ కోల్ లింక్ కెనాల్, ప్యాకేజ్ 16, తురకపల్లి కెనాల్, యం.తురకపల్లి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఎస్ఎల్బీసీ కోసం వైఎస్సార్‌ను ఒప్పించిన: కోమటిరెడ్డి
ఎస్ఎల్బీసీ నిర్మాణం కోసం 2005లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఆయన హయాంలోనే పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రపంంచలోనే ఇది అతి పెద్ద టన్నెల్ అని.. రాజకీయ దురుద్దేశంతో గత ప్రభుత్వం పదేళ్లు పక్కన పెట్టిందని విమర్శించారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే కృష్ణానదిలో మనకు కేటాయించిన నీళ్లను గ్రావిటీ ద్వారా తెచ్చుకోవచ్చన్నారు. నార్కట్ పల్లి మండలం నల్గొండ జిల్లాలోనే ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒకటన్నారు. అందుకే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ చేపట్టామని, రిటైర్డ్ ఇంజనీర్లతో పలుమార్లు స్వయంగా చర్చించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణవెల్లెంలకు నిత్యం తాగునీటిని సరఫరా చేయాలన్నారు.
బ్రహ్మణవెల్లెంల కోసం రూ.300 కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్రమంతా వర్షాలు పడినా నల్గొండ జిల్లాలోని కట్టంగూరు, మునుగోడు, నార్కట్ పల్లి ఏరియాలో అతి తక్కువ వర్షపాతం నమోదైందని.. సాగు, తాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, పంపులు రెడీగా ఉన్నా నీటిని పంపింగ్ చేయడంలేదని అన్నారు. ఈ విషయంపై ప్రతిసారీ ఆఫీసర్లకు చెప్పాలా? అని ప్రశ్నించారు. అప్రోచ్ కెనాల్స్ పూర్తి చేసి దిగువన చెరువులు నింపాలన్నారు. రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు.