
మెదక్, వెలుగు: జిల్లాలోని మెజారిటీ హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ లు అద్దె భవనాల్లో, అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. దీంతో వైద్య సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత భవనాలు మంజూరైనప్పటికీ నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 118 హెల్త్ సబ్ సెంటర్లకు బిల్డింగ్ లు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటి వరకు కేవలం 29 బిల్డింగ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 36 బిల్డింగ్లు ప్రగతిలో ఉన్నాయి. 39 చోట్ల పనులు అసలు మొదలుపెట్టలేదు. 12 చోట్ల టెండర్ ఫైనల్ కాలేదు.
నిధులు సరిపోవడం లేదని..
ఒక్కో హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు పెరగడం వల్ల ఆ నిధులు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ కారణంగా హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ ల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోతుండగా, ప్రారంభం కాని వాటిని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇదీ పరిస్థితి..
రామాయంపేట మండలంలో 8 హెల్త్ సబ్ సెంటర్లు ఉండగా వాటిలో ఆరింటికి పక్కా భవనాలు ఉన్నాయి. డి.ధర్మారంలో అద్దె భవనంలో నడుస్తుండగా, లక్ష్మాపూర్ లో గ్రామ పంచాయతీ భవనంలో నడుస్తోంది. శివ్వంపేట మండలం చండి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ కొత్త భవనం పూర్తయినా ప్రారంభం కాకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతోంది. రత్నాపూర్ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్‌లోనే నడుస్తోంది. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్లాదుర్గం మండలంలో 5 హెల్త్ సబ్ సెంటర్లు ఉండగా, 4 సబ్ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి.
ముస్లాపూర్ లో అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ఇక్కడ హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ మంజూరు కాగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 8 సబ్ సెంటర్ ఉన్నాయి. ఇందులో ఒక అర్కెల గ్రామంలో మాత్రమే సబ్ సెంటర్ కు పర్మినెంట్ బిల్డింగ్ఉంది. మిగతా 7 సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ 7 సబ్ సెంటర్లకు పక్కా భవనాలు మంజూరు కాగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.
కౌడిపల్లి మండలం భుజిరంపేటలో హెల్త్ సబ్ సెంటర్ శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో కొనసాగుతోంది.
అదనపు నిధులకు కృషి
ఇటీవల జరిగిన దిశ కమిటీ మీటింగ్‌లో హెల్త్ డిపార్ట్మెంట్ పై సమీక్ష సందర్భంగా సబ్ సెంటర్ బిల్డింగ్‌ల విషయం చర్చకు వచ్చింది. 118 సబ్ సెంటర్ బిల్డింగ్లు మంజూరైనప్పటికీ కేవలం 29 బిల్డింగ్లు మాత్రమే పూర్తికావడంపై ఎంపీ రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మాణ సామగ్రి ఖర్చు పెరగడం వల్ల రూ.20 లక్షల నిధులు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు బిల్డింగ్‌ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని డీఎంహెచ్‌వో శ్రీరాం తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ అదనంగా మరో రూ.5 లక్షల నిధుల మంజూరుకోసం ప్రతిపాదనలు రూపొందించి పంపిస్తే కేంద్రంలో సంబంధిత మంత్రితో చర్చించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు.