రిపేర్లు లేవ్! శిథిలావస్థకు చేరిన వందల చెక్ డ్యామ్‌లు

రిపేర్లు లేవ్! శిథిలావస్థకు చేరిన వందల చెక్ డ్యామ్‌లు

రిపేర్లు లేవ్!
    శిథిలావస్థకు చేరిన వందల చెక్ డ్యామ్‌లు 

  •     చిన్న వానలకే డ్యామేజ్ అవుతున్నయ్
  •     నిలవని నీళ్లు..రైతులకు తప్పని కష్టాలు
  •     కాల్వలు, వాగులది కూడాఇదే పరిస్థితి...

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో చెక్ డ్యామ్‌‌లకు రిపేర్లు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. వెయ్యికి పైగా చెక్‌‌డ్యామ్‌‌లు ఉన్నా సగానికి పైగా డ్యామేజ్‌‌ కావడంతో నీళ్లు నిలవడం లేదు.  వర్షాలు సమృద్ధిగా కురిసినా వచ్చిన వరద వచ్చినట్లు దిగువకు వెళ్లిపోవడంతో భూగర్భ జల నీటి మట్టం ఆశించిన స్థాయిలో పెరగలేదు.  దీంతో పంటల సాగుకు రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు. చెక్‌‌డ్యామ్‌‌లో పాటు కాల్వలు, వాగులను కూడా పట్టించుకోవడం లేదు.  జమ్ము, పిచ్చి మొక్కలు , చెట్లు మొలిచి అస్తవ్యస్తంగా మారడంతో ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. మరో నెలలో వానాకాలం సాగు మొదలు కానుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారైనా రీపేర్ చేస్తారనుకుంటే నిరాశే ఎదురైందని వాపోతున్నారు.

వెయ్యికి పైగా చెక్‌‌డ్యామ్‌‌లు

సంగారెడ్డి జిల్లాలో ఏకైక తాగు, సాగునీరు ప్రాజెక్టు అయిన సింగూర్ కింద 40 వేల ఆయకట్టు మాత్రమే ఉంది. ఇది కూడా కాల్వలు బాగాలేక సగం ఆయకట్టు మాత్రమే సాగువుతోంది. మిగతా ప్రాంతమంతా చెక్‌‌డ్యామ్‌‌లు, చెరువులు,  కాలువలు, బోర్లపై ఆధారపడాల్సిందే.  జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్‌‌మెంట్ స్టేట్‌‌ ఫండ్స్‌‌తో పాటు ఈజీఎస్‌‌ కింద వెయ్యికిపైగా చెక్‌‌ డ్యామ్‌‌లు నిర్మించింది.  ఇందులో దాదాపు 60 వరకు శిథిలావస్థకు చేరాయి.  సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, అందోల్, వట్ పల్లి, చౌటకూర్, రాయికోడ్, కోహిర్, జహీరాబాద్, న్యాల్కల్, నారాయణఖేడ్, మనూర్, నాగల్ గిద్ద మండలాల్లోని చెక్ డ్యామ్‌‌లు చాలావరకు పాడవడంతో వర్షం పడ్డా నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి.  కొన్నింటింలో చుక్కనీరు కూడా నిల్వ ఉండడం లేదు. మరి కొన్నిచోట్ల వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. నాణ్యత లేని పనులు, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న చోట మార్కింగ్ చేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

వంతెనలనూ పట్టించుకోవట్లే

చెక్ డ్యామ్‌లు, కాల్వలే కాదు వంతెనలను పరిస్థితి కూడా ఇలాగే ఉంది.  జిల్లాలోని వాగులపై ఉన్న అనేక బ్రిడ్జిలు డ్యామేజ్ అయినా కొత్తవి నిర్మించడం లేదు.  సింగూరు బ్యాక్‌ వాటర్‌‌ పరిధిలో మునిపల్లి, రాయికోడ్ మండలాల్లోని మూడు లోలెవెల్ వంతెనలు ప్రతివానాకాలం నీటమునుగుతున్నాయి.  దీంతో అక్కడి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైలెవల్‌ వంతెనలు నిర్మించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. మునిపల్లి మండలంలోని తక్కడపల్లి, గార్లపల్లి గ్రామాల మధ్య డబ్బా వాగుపై వంతెన చేపట్టినా 20 శాతం పనులు కూడా కాలేవు.