హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. వరద సమస్యకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. వరద సమస్యకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్

హైదరాబాద్: ఐటీ, ఫార్మా రంగాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‎ను వరద సమస్య వెంటాడుతోంది. చిన్న వర్షం పడిన కూడా సిటీ చిగురుటాకులా వణికిపోతుంది. విరామం ఇవ్వకుండా ఒక అర్ధగంట భారీ వర్షం పడితే నగరం చెరువులు, కుంటలను తలపిస్తోంది. వరద నీరు రోడ్లపైకి చేరి వాహనదారులు, బస్తీ వాసులు, లోతట్టు ప్రాంత ప్రజలకు నరకయాతన అనుభవించాల్సిందే. 

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరానికి వరద సమస్య ఒక మచ్చగా మారింది. ఈ క్రమంలో వరదలతో నానా అవస్థలు పడుతోన్న హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. హైదరాబాద్‎లో వరద నియంత్రణ కోసం 'స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్' సిద్ధం చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నగరంలో వరద సమస్యలపై దీర్ఘకాలిక పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ ప్రణాళిక తయారు చేయనుంది. నగరంలో వరద నివారణ, చెరువుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది. 

మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు అర్హత కలిగిన కన్సల్టెంట్‎లను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మూసీ నది, హుస్సేన్ సాగర్ వల్ల ఏర్పడే వరదలను నివారించడంతో పాటు వరద నీటి కాలువలలో ఇతర వ్యర్థ జలాలు కలవకుండా చర్యలు తీసుకునేలా ప్లాన్ రూపొందిచనున్నారు. వర్షం నీటిని సరైన పద్ధతిలో వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.