స్మార్ట్ ​ఫోన్..గాడ్జెట్స్లో కొత్త అప్​డేట్ ఏమొచ్చాయంటే..

స్మార్ట్ ​ఫోన్..గాడ్జెట్స్లో కొత్త అప్​డేట్ ఏమొచ్చాయంటే..

స్మార్ట్ ​ఫోన్, గాడ్జెట్స్లో కొత్త అప్​డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు యూజర్లు. ​కంటెంట్ క్రియేటర్స్ అనుకోండి... యూట్యూబ్, సోషల్​మీడియా యాప్స్​లో తాజా ఫీచర్ల గురించి ఆరా తీస్తారు. అందుకని ట్విట్టర్​ నుంచి యుపిఐ పేమెంట్ యాప్స్​ వరకు ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​ అందిస్తుంటాయి. ట్విట్టర్​ సర్కిల్, గూగుల్ వ్యాలెట్ యాప్, యూట్యూబ్​లో గ్రీన్ స్క్రీన్ వంటి ఫీచర్లు అందరికీ నచ్చుతాయి. ఈవారం టెక్నాలజీ అప్​డేట్స్​ గురించి మరింతగా... 
ట్వీట్​ షేరింగ్​ కొందరికే...
ట్విట్టర్​లో ఏదైనా ట్వీట్ పెడితే అందరికీ కనిపిస్తుంది. అలాకాకుండా ఫ్రెండ్స్, ముఖ్యమైనవాళ్లకు  మాత్రమే కొన్ని ట్వీట్స్ షేర్ చేయాలి అనుకుంటున్నారా! అయితే, కొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే ‘ట్విట్టర్ సర్కిల్’ అనే కొత్త ఫీచర్ తెస్తున్నట్టు చెప్పింది ట్విట్టర్. ఈ ఫీచర్ వస్తే  ఫ్రెండ్స్, ముఖ్యమైనవాళ్లు... ఇలా దాదాపు150 మందికి ఒకే ట్వీట్​ని షేర్ చేయొచ్చు. ఆ ట్వీట్ వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ డెవలపింగ్ స్టేజ్​లో ఉంది. ఇన్​స్టాగ్రామ్​లోని ‘క్లోజ్ ఫ్రెండ్స్’ ఫీచర్​ని పోలి ఉంటుంది.  
ఈ ఫీచర్ ఇలా పనిచేస్తుంది  
ఫాలో అయ్యేవాళ్లని, ఫాలో కానివాళ్లని మొత్తం150 మందిని సెలక్ట్ చేసుకోవాలి. ఏదైనా ట్వీట్ పంపించేముందు ‘ట్విట్టర్ సర్కిల్’ ఆప్షన్​ని ఎంచుకుంటే ఆ ట్వీట్​ వీళ్లకు మాత్రమే  వెళ్తుంది. అంతేకాదు యూజర్లు ఈ లిస్ట్​లో మార్పులు చేసుకోవచ్చు. కొందరిని తీసేయొచ్చు.  కొత్తవాళ్లని యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇంకో విషయం ఏంటంటే... ట్విట్టర్ సర్కిల్​లోంచి తీసేసిన విషయం అవతలివాళ్లకు తెలియదు. 
కాల్ రికార్డింగ్ యాప్స్​కి బ్రేక్  
ఆండ్రాయిడ్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ కోసం కొన్ని యాప్స్ వాడుతుంటారు చాలామంది. అయితే, యూజర్ల సేఫ్టీ, ప్రైవసీ కోసం కాల్ రికార్డింగ్ యాప్స్​ని నిలిపివేయనుంది గూగుల్. దాంతో ఇప్పటికే ఫోన్లలో ఇన్​స్టాల్ చేసుకున్న  థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ ఇకపై పనిచేయవు. అయితే, గూగుల్ ఈయాప్స్​ని ఎలా బ్యాన్ చేస్తుందనే విషయంలో క్లారిటీ లేదు.

గూగుల్​ ప్లే స్టోర్​లో ఇవి డౌన్​లోడ్ కాకుండా చేస్తుందా లేదా ఆ యాప్స్​ని ప్లేస్టోర్ నుంచి తీసెయ్యమని డెవలపర్స్​ని అడుగు తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ చేయడానికి ఆండ్రాయిడ్ యాక్సెసబిలిటీ ఎపిఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్​ఫేస్) అప్లికేషన్​ ఉపయోగపడుతుంది. ఇకపై  ఈ అప్లికేషన్​ పనిచేయదు. అంటే కాల్ రికార్డింగ్ యాప్స్​లో కాల్స్ రికార్డ్ అవ్వవు.  అయితే, మామూలుగా ఫోన్​  మట్లాడేటప్పుడు ‘కాల్ రికార్డ్’ బటన్​ నొక్కితే కాల్ రికార్డ్ అవుతుంది. 
కొత్త యుపిఐ ఐడీలు
ఇప్పుడు  ఏ షాప్​లో చూసినా యుపిఐ స్కానర్స్ కనిపిస్తున్నాయి. వాటిని స్కాన్ చేసి, చిటికెలో పేమెంట్స్ చేసేయొచ్చు. అయితే, కొన్నిసార్లు యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్​ఫేస్​) పేమెంట్స్ చేసేటప్పుడు బ్యాంక్ సర్వర్ బిజీ అని చెప్తుంది. దాంతో పేమెంట్ చేయడం సాధ్యం కాదు. అలాంటప్పుడు రెండు మూడు యుపిఐ ఐడీలు ఉంటే ఆ ఇబ్బంది ఉండదు. యూజర్లు ఒక బ్యాంక్ అకౌంట్​కి కనీసం 4 యూపిఐ ఐడీలు పెట్టుకోవచ్చు. 
ఎలా క్రియేట్​ చేయాలంటే..
గూగుల్ ప్లేలో కొత్త యుపిఐ ఐడీలు క్రియేట్ చేయడం కోసం.. గూగుల్ పే యాప్​లో పేమెంట్ మెథడ్స్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. కొత్త యుపిఐ ఐడీకి జతచేయాల్సిన బ్యాంక్ అకౌంట్​ని ఎంచుకోవాలి.  తర్వాత ‘మేనేజ్ యుపిఐ ఐడీస్​’ ఆప్షన్​ని సెలక్ట్ చేయాలి. కొత్త యుపిఐ ఐడీ పక్కన కనిపించే 
‘+’ ఐకాన్ మీద నొక్కితే ఐడీ క్రియేట్ అవుతుంది. వెంటనే ఫోన్​కి కొత్త ఐడీ కన్ఫర్మేషన్ మెసేజ్​ వస్తుంది. పేమెంట్స్ చేసేటప్పుడు నాలుగింటిలో ఏదో ఒక యుపిఐ ఐడీని ఎంచుకోవచ్చు. 

ఆ​న్ లైన్ పేమెంట్ యాప్స్​ వచ్చాక  జేబులో పర్స్ లేకున్నా నడిచిపోతోంది. వీటికి తోడు ఐ ఫోన్ యూజర్లకు యాపిల్ వ్యాలెట్ యాప్, సామ్​సాంగ్ పే వంటి యాప్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం  గూగుల్ త్వరలోనే ఒక కొత్త వ్యాలెట్ యాప్ తీసుకురాబోతోంది. పేరు గూగుల్​ వ్యాలెట్ యాప్. నలభై దేశాల్లోని యూజర్లకు ఈ యాప్​ అందుబాటులోకి రానుంది. ఇదొక వర్చువల్ వ్యాలెట్.  ఇందులో డబ్బులు వేసి, అవసరమైనప్పుడు ఖర్చు చేయొచ్చు. అంతేకాదు బ్యాంక్ కార్డు వివరాల్ని ఈ వ్యాలెట్​లో స్టోర్ చేసుకోవచ్చు.  ఫ్లయిట్ టికెట్స్ ఇందులో పెడితే, ఫ్లయిట్ ఆలస్యమైనప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ యాప్​లో స్టూడెంట్స్ ఐడీ కార్డ్స్, వ్యాక్సిన్​ సర్టిఫికెట్, ఈవెంట్స్ ​కి సంబంధించిన టికెట్లను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు.