
- కాళేశ్వరంతో నాకెలాంటి సంబంధం లేదు
- ప్రాజెక్ట్ నిర్మాణం.. పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమే
- ప్రత్యేక కార్యదర్శి హోదాలో బ్యారేజీలను సందర్శించానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలును నిలిపివేస్తూ రాష్ట్రానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఐఏఎస్ అధికారిణి, గతంలో సీఎంవోలో అదనపు కార్యదర్శిగా చేసిన స్మితా సబర్వాల్ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారణ చేయనున్నది. అప్పటికే ఒక రిటైర్డు అధికారికి వెసులుబాటు కల్పిస్తూ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కాళే శ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఫైళ్ల కదలికలో తాను కీలక పాత్ర పోషించినట్లుగా కమిషన్ రిపోర్టులో పేర్కొనడం అన్యాయమని పిటిషన్‌లో స్మితా సబర్వాల్ పేర్కొన్నారు.
‘‘కాళేశ్వరంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కమిషన్ నన్ను సాక్షిగా పిలిచింది. ఆరోపణలు చేసే ముందు కమిషన్ యాక్ట్ లోని 8బీ, 8సీ సెక్షన్ల కింద నోటీసు ఇవ్వలేదు. నా వాదన వినకుండా తుది నిర్ణయానికి వచ్చేయడం అన్యాయం. నాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులను విచారించే అవకాశం కూడా కల్పించలేదు. కాళేశ్వరం నిర్మాణం.. పూర్తిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. నిర్మాణ పురోగతిని నేనే సమీక్షించినట్లు కమిషన్ తేల్చడం సరికాదు.
ప్రత్యేక కార్యదర్శి హోదాలో బ్యారేజీలను సందర్శించి నాటి సీఎంకు సమాచారం ఇచ్చాను. ఇది పరిపాలనాపరమైన అనుమతుల మంజూరు కిందికి రాదు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. కేబినెట్ ముందు ఫైళ్లు ఉంచలేదు కాబట్టి చర్యలు తీసుకోవాలని కమిషన్ నివేదికలో పేర్కొనడం చెల్లదు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే నా ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుంది. నివేదికను రద్దు చేయాలి’’అని పిటిషన్‌లో స్మితా సబర్వాల్ పేర్కొన్నారు.