Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ ప్రసిద్ధ టైమ్ (TIME) మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడా ప్రముఖుల (100 Most Influential Sportspersons) జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయురాలిగా స్మృతి నిలవడం విశేషం.
మెస్సీ, రొనాల్డ్ సరసన స్మృతి:
టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ 100 మంది లిస్ట్‌లో ప్రపంచ క్రీడా దిగ్గజాలు ఉన్నారు. ఎన్‌బీఏ (NBA) లెజెండ్ లెబ్రాన్ జేమ్స్ హెడ్‌లైన్‌గా నిలిచిన ఈ జాబితాలో ఫుట్‌బాల్ స్టార్స్ లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో, టెన్నిస్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్, గాల్ఫ్ లెజెండ్ రోరీ మెక్‌ఇల్రాయ్, చైనీస్-అమెరికన్ స్కీయర్ ఐలీన్ గు, బాస్కెట్‌బాల్ ప్లేయర్లు విక్టర్ వెంబన్యామా, జాలెన్ బ్రున్సన్, అలాగే ఫిఫా ప్రెసిడెంట్ గియాని ఇన్ఫాంటినో లాంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు గతేడాది భారత్‌లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెలవడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్ కూడా గెలిచిన సౌతాఫ్రికా క్రికెట్ కెప్టెన్ టెంబా బవుమా కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు.
చరిత్ర సృష్టిస్తున్న మంధాన:
మహిళా క్రికెట్ హిస్టరీలోనే స్మృతి మంధాన ఒక గ్రేటెస్ట్ ప్లేయర్‌గా దూసుకుపోతోంది. ఆమె సాధించిన రికార్డులపై టైమ్ మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది.
* 10,000 రన్స్ క్లబ్: మిథాలీ రాజ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా స్మృతి రికార్డు సృష్టించింది.
* డబుల్ డబ్ల్యూపీఎల్ టైటిల్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తూ 2024, 2026 మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్స్ గెలిపించింది.
* వరల్డ్ కప్ విక్టరీ: గతేడాది జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకున్నప్పుడు స్మృతి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించింది. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. ఇక ఒకే ఏడాదిలో మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన వరల్డ్ రికార్డును 2024లో సాధించిన స్మృతి, గతేడాది (2025) ఆ రికార్డును తనే మళ్లీ బ్రేక్ చేసింది.
నెక్స్ట్ టార్గెట్ టీ20 వరల్డ్ కప్:
ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్‌లో స్మృతి మంధాన భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు లేని ‘టి20 వరల్డ్ కప్’ ట్రోఫీని కూడా ముద్దాడి, తన ఖాతాలో మరో అద్భుతమైన రికార్డు వేసుకోవాలని స్మృతి గట్టి పట్టుదలతో ఉంది.
