ఆగని తునికి కలప అక్రమ రవాణా.. మార్కెట్లో డిమాండ్ ​పెరగడంతో రెచ్చిపోతున్న స్మగ్లర్లు

ఆగని తునికి కలప అక్రమ రవాణా.. మార్కెట్లో డిమాండ్ ​పెరగడంతో రెచ్చిపోతున్న స్మగ్లర్లు
  • రెండు నెలల కింద 8 టన్నులు పట్టివేత
  • తాజాగా మరో 10 టన్నులు స్వాధీనం 
  • తునికి కలప తుపాకీల తయారీలో వినియోగం
  • టన్ను రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు 

భద్రాచలం, వెలుగు: అంతర్జాతీయంగా తునికి కలపకు డిమాండ్​పెరగడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ, ఛత్తీస్​గఢ్ సరిహద్దులోని దండకారణ్యంలో అడ్డగోలుగా చెట్లను నరికి తరలిస్తున్నారు. బయట మార్కెట్లో టన్ను తునికి కలప రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షలు పలుకుతోంది. ఆదివాసీలకు, తునికి చెట్లకు విడదీయరాని అనుబంధం ఉంది. వేసవిలో తునికి చెట్టు వీరికి ఉపాధి ఇస్తుంది. ఇప్పుడు అదే చెట్టు స్మగ్లర్ల పాలిట వరంగా మారింది. 

బెరడు లోపల ఉండే నల్లని చేవకు డిమాండ్​పెరగడంతో తునికి చెట్లను ఇష్టారీతిన నరికేస్తున్నారు. రెండు నెలల క్రితం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి, చండ్రుగొండలో బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల తునికి కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా మరో 10 టన్నులు స్వాధీనం చేసుకున్నారు. తునికి కలపను తుపాకీలు, ఆడవారి అలంకరణ వస్తువులు, ఫర్నిచర్​తయారీకి ఉపయోగిస్తారు. 

గుట్టుచప్పుడు కాకుండా..

ఛత్తీస్​గఢ్​దండకారణ్యంలోని మారాయిగూడెం నుంచి ఓ లారీలో దాదాపు 10 టన్నుల తునికి కలపను లోడ్​చేసుకుని సోమవారం రాత్రి లారీ బయలుదేరింది. దుమ్ముగూడెం మండలంలోని బార్డర్​వద్ద అటవీ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ తో సహా కలపను స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం ఫారెస్ట్ డివిజన్​ఆఫీసుకు తరలించారు. బెంగళూరు, ఢిల్లీకి వీటిని తీసుకెళ్తున్నట్లు గుర్తించామని టాస్క్ ఫోర్స్ డీఎఫ్ఓ నాగభూషణం తెలిపారు. అక్కడి నుంచి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, జర్మనీ, జపాన్​ఎగుమతి చేస్తున్నారని తెలిసిందన్నారు. 

భారీ వృక్షాలు నేలమట్టం

రెండు నెలల కింద జిల్లాలోని ములకలపల్లి మండలం రాచన్నగూడెం, ముత్యాలంపాడు, చింతపేట, గుండాలపాడు, తాళ్లపాయి, ములకలపల్లి, మూకమామిడి, మొగరాలగుప్ప, కొబ్బరిపాడు, కమలాపురం, వీకే రామవరం, పూసుగూడెం, మాదారం, మామిళ్లగూడెం, చండ్రుగొండ మండల అడవుల్లో తునికి చెట్లను స్మగ్లర్లు నరికి వేశారు. కొబ్బరిపాడు వద్ద బొలేరో వెహికల్​లో కొంత తునికి కలప పట్టుబడగా, అటవీశాఖ అధికారులు అంతగా పట్టించుకోలేదు. కొత్తగూడెం కేంద్రంగా కొందరు స్మగ్లర్లు జిల్లా అడవుల నుంచి కలపను సేకరించి విదేశాలకు తరలిస్తున్నారు. ఏండ్ల నాటి భారీ వృక్షాలను అధునాతన మిషన్లతో చిన్న చిన్న ముక్కలుగా కట్​చేస్తున్నారు. స్థానిక గిరిజనులకు ఎంతో కొంత ముట్టజెప్పి లారీల్లో తీసుకెళ్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ తరలించి అక్కడి సా మిల్లుల్లో బెరడు తొలగించి లోపల ఉండే నల్లని చేవను ఎక్స్​పోర్ట్​చేస్తున్నారు. చావ చాలా గట్టిగా ఉంటుంది. లోహంలా మెరిసిపోతుంది. తుపాకీ బ్యారెల్ తయారీకి దీనిని ఉపయోగిస్తారు. 

అక్రమ రవాణాపై ఫోకస్​ పెట్టాం 

తునికి కలప అక్రమ రవాణాపై ఫోకస్​పెట్టాం. స్మగ్లర్ల ఆట కట్టిస్తాం. చెట్టు బెరడు లోపల ఉండే నల్లని చేవతో తుపాకీలు, ఫర్నిచర్ తయారు చేస్తారు. విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోంది. ఎర్రచందనంతో సమానంగా అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్​ఉంది. 

నాగభూషణం, డీఎఫ్ఓ, టాస్క్ ఫోర్స్