
ముదిగొండ, వెలుగు: పాము కాటుతో మహిళ చనిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ముదిగొండ మండలం పమ్మి గ్రామనికి చెందిన జాలాది రాధ(50), కుటుంబం కౌలుకు తీసుకున్న భూమిలో పత్తి చేను వేశారు. ఆదివారం ఉదయం కూలీలను తీసుకుని వెళ్లి చేనులో పత్తి తీస్తుండగా రక్త పింజర రాధను కాటు వేయడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. ఆమెను తోటి కూలీలు నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. ఆమెకు భర్త, కొడుకు, కూతురు ఉన్నారు. మృతురాలి భర్త గురవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ తెలిపారు.