రైలులో పాము కాటేసింది.. సీల్ వేసిన అధికారులు

రైలులో పాము కాటేసింది.. సీల్ వేసిన అధికారులు

విమానంలో పాములు.. హాలీవుడ్ సినిమా చూసి ఉంటాం.. ఇప్పుడు రైలులో పాము.. అవును.. కదులుతున్న రైల్లో ఓ వ్యక్తిని పాము కాటేసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. 2024, ఏప్రిల్ 15వ తేదీ తమిళనాడులోని మధురై నుంచి కేరళలోని గురువాయూర్ వెళుతుంది మగధ ఎక్స్ ప్రెస్ రైలు. కార్తీ అనే యువకుడు మధురై నుంచి గురువాయూర్ వెళుతున్నాడు. కార్తీని పాము కాటు వేసింది. దీంతో అతను పెద్దగా కేకలు వేయటంతోపాటు.. మిగతా ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. వారు బోగీని వదిలేసి మరో బోగీలోకి పరుగులు తీశారు.

ఈ విషయాన్ని రైలులోని టికెట్ కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో.. కొట్టాయం రైల్వేస్టేషన్ కు చేరుకుంది రైలు.  అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఫారెస్ట్ అధికారులు, వైద్య సిబ్బందిని.. పాము కాటుకు గురైన కార్తీని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.

రైలు బోగీలో పాము ఉండటంతో.. దాన్ని పట్టుకునేందుకు బోగీకి సీల్ వేశారు రైల్వే అధికారులు. రైలు ప్రయాణంలో మార్గమధ్యలో.. ఓ దట్టమైన అటవీ ప్రాంతం దగ్గర రైలు కొద్దిసేపు ఆగిందని.. అప్పుడే పాము రైలులోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. పాములు పట్టేవారిని పిలిచి.. బోగీలోని పామును పట్టుకునేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. పాము.. సీల్ వేసిన బోగీలోనే ఉందా లేక మరో బోగీలోకి వెళ్లిందా అనేది కూడా తెలియక తికమక పడుతున్నారు.