హిమాచల్, జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న స్నోఫాల్
జమ్మూ- శ్రీనగర్ హైవేపై రాకపోకలు బంద్
ఢిల్లీలో మళ్లీ వర్షాలు, పెరగనున్న చలి
నార్త్ ఇండియా చలికి గజగజా వణుకుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మంచు భారీగా కురుస్తోంది. ఢిల్లీ సహా నార్త్ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కూడా పడనున్నాయని, రానున్న రోజుల్లో టెంపరేచర్లు మరింత పడిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం అక్కడక్కడ తేలికపాటి వానలు పడ్డాయి. రానున్న 24 గంటల్లో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్ సీఆర్)లో ఉరుములు, పిడుగులు, వడగండ్లతో కూడిన వానలు పడే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. వారం రోజులుగా ఢిల్లీలో టెంపరేచర్లు బాగా పడిపోయాయి. కొన్ని చోట్ల మినిమం టెంపరేచర్లు 1.7 డిగ్రీలకు పడిపోయాయి. మంగళవారం మాత్రం కనీసం13 డిగ్రీలు, ఎక్కువగా 18 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో ఎన్ సీఆర్ సహా నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో టెంపరేచర్లు పడిపోతాయని తెలిపింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో మంగళవారం నుంచి గురువారం వరకూ అక్కడక్కడ వర్షాలు పడతాయని వెల్లడించింది.
హిమాచల్లో మంచు వానలు
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, మనాలి, కుఫ్రి, డల్హౌసీ తదితర ప్రాంతాల్లో మంగళవారం కూడా మంచు కురిసింది. దీంతో టూరిస్టులు అక్కడికి క్యూ కడుతున్నారు. అయితే, మంచు కారణంగా రాష్ట్రంలో దాదాపు100 రోడ్లు బ్లాక్ అయిపోయాయి. రాష్ట్రంలోని కీలాంగ్లో మైనస్ 7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. బ్లాక్ అయిన రోడ్లపై మంచును తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిమ్లా జిల్లాలోని కుఫ్రిలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం మధ్య 20 సెంటీమీటర్ల మేర మంచు వర్షం కురిసిది. కీలాంగ్లో 15.3 సెంటీమీటర్లు, కల్పాలో 15.2, డల్హౌసీలో 15, సిమ్లాలో 14, మనాలిలో 8 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. హిమాచల్లో ఈ సీజన్లో ఎక్కువగా కోఠిలో 45 సెంటీమీటర్ల మంచు కురిసింది. అన్ని చోట్ల టెంపరేచర్లు మైనస్లకు పడిపోయాయి.
జమ్మూ- శ్రీనగర్ హైవే మూసివేత
కాశ్మీర్ను దేశంతో కలిపే ఏకైక ఆల్ వెదర్ రోడ్ అయిన జమ్మూ – శ్రీనగర్ నేషనల్ హైవేను రెండు రోజులుగా మూసివేశారు. 270 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేపై రాంబన్ జిల్లాల్లో పలు చోట్ల మంచు ఎక్కువైంది. కొండచరియలు విరిగి పడుతున్నాయి. కాశ్మీర్ వ్యాలీకి గేట్ వేగా ఉన్న జవహర్ టన్నెల్ వద్ద 8 ఇంచుల మందంలో మంచు పేరుకుపోయింది. మంగళవారం నుంచి వాతావరణం మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని, కానీ12వ తేదీ నుంచి మరో దఫా మంచు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో వైష్ణోదేవి ఆలయానికి మంగళవారం హెలికాప్టర్ సర్వీసులను నిలిపివేశారు. స్నోఫాల్ తగ్గిన తర్వాత తిరిగి సర్వీసులను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మంచుతో రోడ్లు కొన్ని ఇంచుల వరకూ బ్లాక్ అవుతున్నా, రియాసీ జిల్లాలోని త్రికూట హిల్స్పై ఉన్న వైష్ణోదేవి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలి వెళ్తున్నారు.
2019.. 7వ హాట్ ఇయర్
పోయిన డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యావరేజ్ మినిమం టెంపరేచర్118 ఏళ్లలోనే రెండో అత్యల్ప రికార్డుగా నమోదైంది. డిసెంబర్ లో యావరేజ్ మినిమం టెంపరేచర్ 18.76 డిగ్రీలు రికార్డ్ కాగా, 1901 తర్వాత ఇంత తక్కువ టెంపరేచర్ నమోదవడం రెండోసారి అయింది. 1997లో ఇంతకన్నా తక్కువగా17.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అయితే డిసెంబర్ లో టెంపరేచర్ లు బాగా తగ్గినప్పటికీ, 2019 ఏడాది మొత్తం చూస్తే 1901 నుంచి అత్యంత వేడి సంవత్సరాల్లో ఇది 7వ స్థానంలో నిలిచిందని ఐఎండీ వెల్లడించింది. గత జూన్ నుంచి సెప్టెంబర్ వర్షాకాలం వరకు తీసుకుంటే 1901 నుంచీ 2019 అత్యంత వేడి సంవత్సరమని తెలిపింది. గత ఏడాది జనవరి, మార్చి, డిసెంబర్ మినహాయిస్తే ప్రతి నెలలోనూ టెంపరేచర్లు నార్మల్ కంటే 1 డిగ్రీ ఎక్కువగానే నమోదయ్యాయని పేర్కొంది. 2019లో అరేబియన్ సముద్రంలో 5 సైక్లోన్ లు ఏర్పడ్డాయని, 1902 నుంచి ఇక్కడ ఇన్ని సైక్లోన్లు ఏర్పడటం రికార్డని ఐఎండీ పేర్కొంది. వీటిలో రెండు తీవ్రమైన సైక్లోన్లుగా, ఒకటి అత్యంత తీవ్రమైన సైక్లోన్ గా, మరొకటి సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ గా మారాయని వివరించింది. గత ఏడాది ఏర్పడిన తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా 1,562 మంది చనిపోయారని పేర్కొంది.

