
డయాలసిస్ పేషంట్లకు సేవలు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్రమే ఛాంపియన్ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలపాలని చెప్పారు. భారతదేశంలో సింగిల్ యూజ్ ఫిల్టర్ సిస్టమ్ ను ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొదటిసారి అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇంతకు ముందెన్నడూ ఈ సిస్టమ్ ఎక్కడా ఉండేది కాదన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న ఈ విధానాన్ని తాము కూడా అడాప్ట్ చేసుకుంటామని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇటీవల చెప్పారని తెలిపారు.
తెలంగాణ ఏర్పడక ముందు రెండు, మూడు ఆస్పత్రుల్లోనే సింగిల్ యూజ్ ఫిల్టర్ సిస్టమ్ ఉండేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రస్తుతం 100 డయాలసిస్ సెంటర్లకు పెంచామని తెలిపారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ కంట్రోల్ చేస్తున్నామని అన్నారు. కిడ్నీ పేషెంట్స్ కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.700కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. ప్రతీ సంవత్సరం రూ.100 కోట్లు డయాలసిస్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్పారు. ఫ్రీ బస్ పాస్, ఆసరా పెన్షన్ కూడా డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్నామని చెప్పారు. ట్రాన్స్ ప్లాంట్ చేసుకున్న వారికి కూడా జీవితకాలం ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల డయాలసిస్ సైకిల్స్ పూర్తి చేసుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. 10వేల మంది పేషెంట్స్ ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారని చెప్పారు.
కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. దీనికి ముఖ్యంగా నీటి నాణ్యతే కారణమని చెప్పారు. లోతైన భూగర్భ జలాల్లో ఉన్న ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువైపోయి కిడ్నీలు దెబ్బతింటున్నాయన్నారు. అందుకే ప్రతి ఇంటికీ శుభ్రమైన, శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు.