నా రాజీనామా వల్లే ఇన్ని స్కీములు

నా రాజీనామా వల్లే ఇన్ని స్కీములు
  • కేసీఆర్​ నయా నిజాం అవతారం ఎత్తిండు: ఈటల

కమలాపూర్, వెలుగు: కేసీఆర్​ నయా నిజాం అవతారం ఎత్తారని,  జాగ్రత్తగా ఉండాలని హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్​ సూచించారు. కేసీఆర్​కు ఇన్నాళ్లూ గుర్తుకురాని స్కీంలు ఉప ఎన్నిక వేళ గుర్తుకువచ్చాయని, నియోజకవర్గంలో వందల కోట్ల డబ్బులు దించుతున్నారని అన్నారు.  ‘‘కేసీఆర్​ నన్ను బయటకు పంపి పుణ్యం కట్టుకున్నడు. నా రాజీనామా వల్లే ఉప ఎన్నిక వస్తున్నది. అందుకే ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు టీఆర్​ఎస్​ ప్రభుత్వం పింఛన్లు, గొర్లు, డబుల్​ బెడ్​ రూం ఇండ్లు, దళిత బంధుతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నది. ఆ పార్టీ ఇచ్చే పైసలు, స్కీములు  తీసుకొని ఓటు మాత్రం బీజేపీకి వేయాలి. హుజూరాబాద్​లో దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి” అని అన్నారు. ఈటల రాజేందర్​ ప్రజా దీవెన యాత్ర ఆదివారం 7వ రోజు వరంగల్​ అర్బన్​ జిల్లా కమలాపూర్​ మండలంలో కొనసాగింది. మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలతో ప్రధాన రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అంబేద్కర్​, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసిన ఈటల రాజేందర్​, బీజేపీ కోర్​ కమిటీ మెంబర్​ వివేక్​ వెంకటస్వామి పాదయాత్రగా ప్రధాన రహదారి వెంట రామాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఈటల మాట్లాడుతూ.. ‘‘నిజంగా నేను తప్పు చేసివుంటే ఎంక్వైరీ చేసి తప్పు తేల్చాలి కానీ సీఎం కేసీఆర్​కు ఆ దమ్ము లేదు. ఎందుకంటే ఆయన పెద్ద అబద్ధాల కోరు. ఆయన చేసింది ముమ్మాటికీ కుట్ర” అని మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలకు, సంక్షేమ పథకాలకు పైసలు ఇవ్వని ముఖ్యమంత్రి తనను ఓడించడానికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని ఆయన  ఆరోపించారు. 2018లోనూ తనను ఓడించేందుకు ప్రయత్నించారని, కానీ హుజూరాబాద్​ ప్రజలు తనను అక్కున చేర్చుకొని గెలిపించారని అన్నారు. ‘‘ఇప్పుడు నా ఓటమి కోసం నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నరు. జేజెమ్మలు దిగొచ్చినా హుజూరాబాద్​లో గెలుపు బీజేపీదే” అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షులు రావు పద్మ, నేతలు దూది శ్రీనివాస్​, తుల ఉమ, కట్కూరి అశోక్​ రెడ్డి, ఈటల భద్రయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.