
హైదరాబాద్, వెలుగు : ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సభ్యులుగా ఉన్న సీఈఓ క్లబ్స్ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ‘సోషల్ ఇంపాక్ట్ సీఈఓ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేసింది. ఆదివారం బెంగుళూరులో జరిగిన ‘గో బియాండ్ 2023’ రిట్రీట్ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆరోగ్య స్వామి వేలుమణి ఈ అవార్డును ఎన్వీఎస్ రెడ్డికి అందజేశారు.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టును వినూత్న రీతిలో అమలు చేశారని ఎన్వీఎస్ రెడ్డిపై సీఈఓ క్లబ్స్ ఆఫ్ ఇండియా ప్రశంసల వర్షం కురిపించింది. హైదరాబాద్ లో ప్రయాణ సంస్కృతిపై ఎన్వీఎస్ రెడ్డి చేసిన సేవలను ప్రశంసించింది. ఈ కార్యక్రమంలో మరో హైదరాబాది ప్రగతి ప్రింటర్స్ సీఎండీ నరేంద్ర పరుచూరి ‘ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ఇయర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు’ ను అందుకున్నారు.