- గచ్చిబౌలిలో ఐటీ కంపెనీ ఎండీ కిడ్నాప్ కలకలం
- ఇద్దరు అరెస్ట్, పరారీలో 12 మంది
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
గచ్చిబౌలి, వెలుగు : ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండీ కిడ్నాప్ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో కలకలం సృష్టించింది. ఈ నెల 14న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సాయి గుప్తా గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్ వద్ద కిక్ స్టార్ట్ అనే ఐటీ కంపెనీ నడుపుతున్నాడు. నిజాంపేట్‌కు చెందిన గౌతమ్ భవిరిశెట్టి అనే వ్యక్తి హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సాయిగుప్తా, గౌతమ్ కలిసి గతంలో ఫైనాన్స్ బిజినెస్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి.
దీంతో సాయిగుప్తాను కిడ్నాప్ చేసేందుకు జగద్గిరిగుట్టకు చెందిన రౌడీ షీటర్ ప్రశాంత్‌తో కలిసి గౌతమ్ ప్లాన్ చేశాడు. ఈ నెల 14న రాత్రి 8 గంటల టైంలో సాయిగుప్తా, నిజాంపేటకు చెందిన సతీశ్‌రెడ్డి అనే వ్యక్తితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. ఈ టైంలో గౌతమ్, రౌడీషీటర్ ప్రశాంత్ వేర్వేరు కార్లలో వెంబడించి హఫీజ్‌పేట్ రైల్వే ట్రాక్ వద్ద సాయి గుప్తా కారును ఢీకొట్టారు. తర్వాత కారు దిగి తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులం అంటూ సాయిగుప్తా, సతీశ్‌రెడ్డిని తమ కారులో ఎక్కించుకొని కూకట్‌పల్లి మీదుగా జగద్గిరిగుట్ట వైపు, అక్కడి నుంచి షాపూర్‌నగర్ వైపు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడ ఇద్దరిపై దాడి చేశాక, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 4 కోట్లు తెప్పించాలని, లేదంటే ఇద్దరిని చంపేస్తామని బెదిరించారు. తర్వాత అక్కడి నుంచి వికారాబాద్ తీసుకెళ్లి మరోసారి కొట్టారు. శనివారం ఉదయం వరకు సాయిగుప్తా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న గౌతమ్, ప్రశాంత్ సాయిగుప్తాతో ఖాళీ బాండ్ పేపర్ల సంతకాలు చేయించుకొని
ఇద్దరినీ వికారాబాద్‌లో వదిలేసి పారిపోయారు. సాయిగుప్తా ఉన్న ప్లేస్‌ను గుర్తించిన పోలీసులు శనివారం మధ్యాహ్నం అక్కడికి చేరుకొని ఇద్దరినీ హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడ్డ సాయిగుప్త, సతీశ్‌రెడ్డిని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టిన గచ్చిబౌలి పోలీసులు గౌతమ్‌తో పాటు అతడి ఫ్రెండ్ అశోక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రశాంత్‌తో పాటు మరో 11 మంది పరారీలో ఉన్నారని గచ్చిబౌలి ఇన్స్‌పెక్టర్ తెలిపారు.