
అతని పేరు మురళీ కృష్ణ.. సొంతూరు ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరుబు గ్రామం. తండ్రి మేస్త్రీ పని.. తల్లి కూలి పనులతో జీవనం.. ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన ఏకైక కుమారుడు.. కష్టపడి చదివించారు.. మురళీ కృష్ణ కూడా అంతే బాధ్యతగా.. శ్రద్ధగా చదువుకున్నాడు. ఇంజినీరింగ్ చదవి హైదరాబాద్ వచ్చాడు. లక్ష్యం సాఫ్ట్ వేర్ ఉద్యోగం అయినా వెంటనే దొరకలేదు.. ఖాళీగా ఉండకుండా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. అమీర్ పేట సెంటర్ లో సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకున్నాడు. ఏడాది కష్టం.. ఎట్టకేలకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాడు. మార్చి 17వ తేదీన ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కొత్త ఉద్యోగంలో చేరితే సెలవులు దొరుకుతాయో లేదో అని.. సొంతూరులోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి నాలుగు రోజులు గడిపాడు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ తిరిగి వచ్చాడు.
మార్చి 10వ తేదీ స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తుండగానే.. మురళీకృష్ణ సీట్లోనే ఒరిగిపోయాడు. స్నేహితులు భయపడి వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు. తీవ్ర గుండెపోటు రావటంతోనే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. మృతదేహాన్ని మధిర తరలించారు స్నేహితులు.
26 ఏళ్ల మురళీ కృష్ణ.. చేతికి వచ్చిన కొడుకు.. రెండు రోజుల క్రితమే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేరటానికి ఇంటి నుంచి వెళ్లిన కొడుకు.. జీవచ్ఛవంగా తిరిగి రావటంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. కష్టాలు తీరుస్తానని చెప్పి వెళ్లినవాడు.. కాటికి వెళ్లాడు అంటూ రోధిస్తున్న ఆ కుటుంబ సభ్యులను ఓదార్చటం ఎవరి వల్లా కాలేదు.
మురళీ కృష్ణకు ఎలాంటి దుర అలవాట్లు లేవని.. ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటాడని.. ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలు కూడా లేవని చెబుతున్నారు స్నేహితులు.