డీఎస్సీ అప్లికేషన్లకు సాఫ్ట్​వేర్ ప్రాబ్లమ్

డీఎస్సీ అప్లికేషన్లకు సాఫ్ట్​వేర్ ప్రాబ్లమ్
  • డీఎస్సీ అప్లికేషన్లకు సాఫ్ట్​వేర్ ప్రాబ్లమ్
  • అప్లై చేసుకునేందుకుజంకుతున్న అభ్యర్థులు 
  • సబ్మిట్ తర్వాత డేటాఫ్ బర్త్, టెట్ మార్కులు, జిల్లాల వివరాల్లో తప్పులు
  • పనిచేయని ఫోన్ నంబర్లు, పట్టించుకోని అధికారులు 

హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీకి మొదలైన డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియకు సాఫ్ట్​వేర్ సమస్య ఎదురవుతోంది. వివరాలు ఎంటర్ చేసినప్పుడు సరిగానే కనిపిస్తున్నా..  సబ్మిట్ చేయగానే మారిపోతున్నాయి. ఈ సమస్యపై స్కూల్ ఎడ్యుకేషన్​ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలోని 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ రాత పరీక్షకు గత నెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 21 వరకు అప్లై చేసుకునే వీలుంది. గురువారం మధ్యాహ్నం వరకు కేవలం 36,897 మందే దరఖాస్తు చేసుకున్నారు. 
ఇందులో సగానికి పైగా అప్లికేషన్లలో తప్పులున్నట్టు అభ్యర్థులు చెప్తున్నారు. 

ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి

విద్యా శాఖ సూచించిన వెబ్​సైట్​లో మొదట ఆధార్ కార్డు నంబర్​తో ఎంటరై వ్యక్తిగత వివరాలు, అప్లై చేసే పోస్టు ఎంటర్ చేసి రూ.వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంది.  ఆ వెంటనే జర్నల్ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా అప్లికేషన్ పూర్తి చేయాలి. అయితే ముందుగా ఎంటర్​ చేసిన వివరాలు.. సబ్మిట్ చేయగానే తప్పుగా కనిపిస్తున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రధానంగా డేటాఫ్ బర్త్, టెట్ మార్కులు, విద్యార్హతలు, పాసైన  సంవత్సరం వివరాలు, జిల్లాలు.. ఇలా అనేక అంశాలు తప్పుగా కన్పిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎవరికి చెప్పుకోవాలి?

డీఎస్సీ అభ్యర్థుల కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేయడం లేదు. అసలు ఆ నంబర్ పనిచేయకున్నా నోటిఫికేషన్​ వివరాల్లో పేర్కొనడం గమనార్హం. దీంతో సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క టెక్నికల్ సపోర్టు పేరుతో నంబర్లు ఇచ్చినా, వాటినీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని చెబుతున్నారు. వారిచ్చిన మెయిల్​కు మెసేజ్​లు చేసినా రిప్లే ఇవ్వడం లేదని అంటున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా టెక్నికల్ సమస్యలను పరిష్కరించి, ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి కోరారు.