రామగుండంలో ఓపెనింగ్కు సిద్ధంగా సోలార్ ప్లాంట్

రామగుండంలో ఓపెనింగ్కు సిద్ధంగా సోలార్ ప్లాంట్
  • రామగుండంలో ఓపెనింగ్​కు సిద్ధంగా సోలార్​ ప్లాంట్
  •     ఈడీ చందన్​ కుమార్​ సమంత

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీలో 176 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్​ సిద్ధంగా ఉందని, నెల రోజుల్లో ప్లాంట్​ను ప్రారంభిస్తామని రామగుండం, తెలంగాణ ప్రాజెక్ట్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ చందన్​ కుమార్​ సమంత తెలిపారు. ఇందులో 120 మెగావాట్ల గ్రౌండ్  సోలార్, 56 మెగావాట్ల ప్లోటింగ్ సోలార్  ప్రాజెక్ట్  నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ హాల్​లో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ సోలార్, హైడల్​ పవర్​ వంటి పర్యావరణ హితమైన విద్యుత్​ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

 తెలంగాణ స్టేజీ–2లో భాగంగా 2,400 మెగావాట్ల ప్లాంట్​ నిర్మాణానికి అవసరమైన పీపీఏ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఎన్టీపీసీ కార్పొరేట్​ మేనేజ్​మెంట్​ చర్చిస్తోందని చెప్పారు. ఈ ప్లాంట్​ నిర్మాణానికి ఎన్విరాన్​మెంట్​ క్లియరెన్స్​ వచ్చిందని, కొత్తగా భూమిని సేకరించే అవసరం కూడా లేదన్నారు. ఎన్టీపీసీలో ఈ వార్షిక సంవత్సరం 13.4 బిలియన్  యూనిట్లతో 86.2 శాతం ఉత్పత్తి సాధించగా, తెలంగాణ సూపర్  థర్మల్  విద్యుత్  ప్రాజెక్ట్​లో 9.2 బిలియన్  యూనిట్లతో 91.4 శాతం ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా గోదావరిఖనిలో ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం హాస్టల్ ను రూ.2.14 కోట్లతో నిర్మించామని చెప్పారు. గతంలో ఉన్న రూ.7 కోట్ల సీఎస్ఆర్​ ఫండ్​ను రూ.16 కోట్లకు పెంచామని తెలిపారు. జీఎంలు ముకుల్ రాయ్(తెలంగాణ), మనీశ్  అగర్వాల్(రామగుండం), అభిజిత్  దత్తా, బినోయ్ జోస్, రావత్, హెచ్ఆర్  ఏజీఎం బిజోయ్ కుమార్  సిక్దర్, కమ్యూనికేషన్​ ఎగ్జిక్యూటివ్​ శాంభవి రాయ్  పాల్గొన్నారు.