మల్లన్న సాగర్​లో రెండేళ్లలో సోలార్ పవర్ ప్లాంట్

మల్లన్న సాగర్​లో రెండేళ్లలో సోలార్ పవర్ ప్లాంట్
  • డీపీఆర్ కు సిద్దమవుతున్న  అధికారులు
  • 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లు
  • ఆసియాలోనే అతిపెద్ద ప్లాంట్ గా మారే అవకాశం

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్  రిజర్వాయర్ లో  ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.  ఇందుకోసం సింగరేణి కంపెనీ 500 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కోసం 250 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన  రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోలార్ పవర్ ఉత్పత్తిపై అంగీకారం తెలపడంతో డీపీఆర్ సిద్దం చేయడం కోసం సింగరేణి అధికారులు సర్వే చేస్తున్నారు. 

50 టీఎంసీల సామర్థ్యంతో 18 వేల ఎకరాల విస్తీర్ణంలో  నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో 1500 ఎకరాల్లో ఈ ప్లాంట్లను  ఏర్పాటు చేస్తారు. ఒక్క మెగావాట్ కు రూ.7 కోట్ల చొప్పున దాదాపు రూ.3500 కోట్లు ఖర్చుచేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే మూడు నాలుగు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఆసియాలో నే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్

దేశంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటే అతిపెద్దది కాగా సింగరేణి సంస్థ500 మెగా వాట్ల  ప్లాంట్ ను ఏర్పాటు చేస్తే ఆసియాలోనే అతి పెద్ద ప్లాంట్ గా నిలవనుంది. నేలపై  ఒక మెగా వాట్ సమర్థ్యం కలిగిన సొలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఐదెకరాల స్థలం అవసరమవుతుంది. దీనివల్ల భూసేకరణకు ఇబ్బంది ఏర్పడుతోంది. అందుకే సింగరేణి సంస్థ నీటిపై  తేలియాడే పలకలను ఏర్పాటు చేసే సోలార్ పవర్ ఉత్పత్తి వైపు మొగ్గుచూపుతోంది. ఈ ప్లాంట్ వల్ల  ప్రతిరోజు 10 నుంచి 20 శాతం వరకు నీరు ఆవిరికాకుండా కాపాడవచ్చని ఇరిగేషన్​ అధికారులు చెబుతున్నారు.

వచ్చే రెండేళ్ల లో పనులు పూర్తి

మల్లన్న సాగర్ లో నిర్మించే  500 మెగావాట్ల  సోలార్ పవర్ ప్లాంట్ ను రెండేళ్ల లో ఏర్పాటు చేయాలనే దిశగా  ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఏడాది క్రితమే సింగరేణి అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించి  ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని గుర్తించారు.  ప్రస్తుతం డీపీఆర్ సిద్దం చేసే క్రమంలో రిజర్వాయర్ లోతు, ఎత్తు వంపుల గురించి సర్వే చేయనున్నారు. కనిష్టంగా ఆరు మీటర్ల లోతు ఉంటే  తేలియాడే పలకలను ఏర్పాటు చేసే అవకాశం ఉండగా గరిష్టంగా లోతు ఎంతైనా ఉండవచ్చు. మల్లన్న సాగర్ లో కనిష్టంగా ఎల్లప్పుడు 10 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉండడంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కు ఎలాంటి సమస్య ఉండదని సింగరేణి అధికారులు భావిస్తున్నారు.