
- 253 కమర్షియల్, 916 ఇండ్లలో సోలార్ పవర్
- ఆరు చోట్ల సోలార్చార్జింగ్ స్టేషన్లకు రెడ్కో టెండర్లు
- కలెక్టరేట్ సహా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ సోలార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
- సూర్యాఘర్ స్కీమ్ కింద 30 గ్రామాల ఎంపిక
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో సోలార్ సిస్టం విస్తరిస్తోంది. విద్యుత్ ఖర్చు ఆదా కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వందల సంఖ్యలో సోలార్ సిస్టమ్ ఏర్పాటవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్లు, పలు హాస్టళ్లలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయగా, అన్ని ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. కమర్షియల్ రంగంలో సోలార్ విద్యుత్ వల్ల ప్రతి నెలా సుమారు రూ.5 లక్షల కరెంట్ బిల్లు ఆదా అవుతోంది.
షాపింగ్ మాల్స్, థియేటర్స్, రైస్ మిల్లుల్లో..
దాదాపు రూ.3.5 కోట్ల ఖర్చుతో ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 1000 కిలోవాట్లకు సమానమైన ఈ పవర్‌తో 3 నుంచి 5 చిన్న రైస్‌మిల్లులు లేదా 2 పెద్ద మిల్లులను రన్ చేయవచ్చు. 24 గంటలు సెంట్రల్ ఏసీ నడిచే ప్రైవేట్ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, థియేటర్లకు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కరెంట్ బిల్లు వస్తోంది. దీంతో జిల్లాలోని 253 మంది వ్యాపారులు రూ.వంద కోట్లకు పైగా ఖర్చుచేసి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు.
916 ఇండ్ల యజమానులు ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున పోగు చేసి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోగా, నెలకు రూ.20 లక్షల కరెంట్ బిల్లు ఆదా అవుతోంది. సోలార్ పవర్ఏర్పాటుకు బ్యాంకర్లు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తుండడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది.
సర్కార్ ఆఫీసుల్లో..
ఇందూర్, ఆర్మూర్, బోధన్ ఆర్టీసీ డిపోల్లో ఇప్పటికే సోలార్ పవర్ వినియోగిస్తున్నారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్, డిచ్పల్లి మండలంలోని సుద్దులం, పోచంపాడ్ రెసిడెన్షియల్ కాలేజీలు, బోధన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో రూ.లక్షల కరెంట్ బిల్లు ఆదా అవుతోంది. అన్ని ప్రభుత్వ బిల్డింగ్‌లకు సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత వారం అధికారులకు ఆదేశాలివ్వగా, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కలెక్టరేట్ సహా 545 పంచాయతీ ఆఫీస్‌లు, 1,156 స్కూల్స్, 137 హాస్పిటల్స్, 151 గురుకులాలు, జిల్లావ్యాప్తంగా ఉన్న 58 గవర్నమెంట్ ఆఫీసుల్లో సోలార్ సిస్టం కోసం ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల మాదిరిగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు జిల్లాలో ఆరు సోలార్‌పవర్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఆర్మూర్, డిచ్పల్లి, గన్నారం, సాలూరా, ముగ్పాల్, పెర్కిట్ లలో వీటిని నెలకొల్పేందుకు రెడ్కో ఈ నెల టెండర్లు పూర్తి చేసింది. సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద అధికారులు 30 గ్రామాలను ఎంపిక చేసి సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆఫీసుల్లోనూ సోలార్
ప్రభుత్వ ఆఫీసుల్లో సోలార్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. వ్యాపారులు సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకుని ఖర్చు తగ్గించుకున్నారు. జిల్లాలో కొన్ని ఇండ్లు కలిసి సోలార్ పెట్టుకోవడం అభినందనీయం. సోలార్ సిస్టంపై విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.- రమణ, జిల్లా మేనేజర్, రెడ్కో