రాహుల్ తోనే సమస్యల పరిష్కారం : మంత్రి శ్రీధర్ బాబు

రాహుల్ తోనే సమస్యల పరిష్కారం : మంత్రి శ్రీధర్ బాబు
  • మీలో ఒకడిగానే వంశీ ఉంటడు
  • మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళిక
  • యువతను బీజేపీ మోసం చేసింది

 బెల్లంపల్లి: పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వైట్ పేపర్​ లాంటోడని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని బెల్లంపల్లిలో నిర్వహించారు. ఈ మీటింగ్​కు హాజరైన మంత్రి  శ్రీధర్​ బాబు మాట్లాడుతూ బెల్లంపల్లిలో  వినోద్​ను ఎమ్మెల్యేగా గెలిపించినట్లే వంశీని భారీ మెజారిటీతో ఎంపీఆ గెలిపించాలన్నారు. ఎంపీ మనోడైతేనే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ వస్తాయన్నారు. పెద్దపల్లిని డెవలప్​ చేయాలనే లక్ష్యంతో వంశీ ఉన్నారన్నారు. యువకుడు. ఆలోచనాపరుడైన వంశీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. 

కాకా వెంకటస్వామి కృషితోనే ప్రాణహిత ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. కాకా హయాంలోనే సింగరేణి అభివృద్ధి  చెందిందన్నారు. వంశీని ఎంపీగా గెలిపిస్తే  ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి తాగే నీటిని వినోద్​ తీసుకొస్తారని ప్రకటించారు. అందరిలో ఒకడిగానే వంశీ ఉంటాడన్నారు. యువతకు దిక్సూచిగా నిలబడి  ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వచ్చాడన్నారు.  రైతుల సమస్యలపై పార్లమెంట్ లో వంశీ పోరాటం చేస్తారని మంత్రి చెప్పారు.  మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. ఇప్పుడు బూతుస్థాయిల్లో కష్టపడ్డవారికే స్థానిక ఎన్నికల్లో అవకాశం ఉంటుందన్నారు.

 జూన్​ 6 తరువాత ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇస్తామన్నారు.  యువతను మోసం చేసిన బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని నిలదీశారు. ఉద్యోగాలు రావాలంటే రాహుల్​కు ఓటేసి కాంగ్రెస్ ను గెలిపిద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతోందని ఆరోపించారు. లేదా వాటిని మూసివేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లలో 20  కోట్ల జాబ్స్​ ఇస్తామని చెప్పి కేవలం 6 లక్షలు మాత్రమే ఇచ్చారని ఆయన విమర్శించారు. రాహుల్​ ప్రధాని అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

 సీఎం రేవంత్ నాయకత్వంలో కులగణన చేపట్టడం జరిగిందన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్ ఉంటుందన్నారు. బీజేపీకి బీఆర్​ఎస్​మద్దతు పలికి మోసం చేసిందన్నారు. కరువు అనేది ప్రకృతి వైపరీత్యం అని అన్నారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉంటే బీఆర్​ఎస్​ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు రుణమాఫీ చేశామన్నారు.