మంచి భయం అవసరం

మంచి భయం అవసరం

భయం... భయం.. భయం...

కొందరికి చీకటిని చూస్తే భయం. మరి కొందరికి దెయ్యాలంటే భయం. పోలీసులంటే భయం, టీచర్లంటే భయం, బడికి వెళ్లి చదువుకోవాలంటే భయం.తల్లిదండ్రులు కొడతారేమోనని భయం. ఇలా ఎక్కడ చూసినా ఏదో ఒక రకంగా భయం ఆవరించి ఉంటుంది. ఈ భయాల వల్ల ఎవరికి వారు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడతారు.
కాని ప్రతి మనిషికి ఎంతో కొంత భయం చాలా అవసరం. ఆ భయం వల్ల మంచి జరగాలి. సమాజం బాగుపడాలి. ఆ భయం వల్ల కుటుంబం సక్రమంగా నడవాలి.
పెద్దలు, గురువుల పట్ల భయభక్తులు ఉండటం చాలా అవసరం. ఆ భయం కేవలం భయంగా కాక గౌరవంతో కూడినది అయి ఉండాలి. ఆ భయం వల్ల తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఒక వేళ వచ్చినా వెంటనే మనసు ఆ తప్పు చేయకుండా అడ్డుపడుతుంది. ఇంకా తప్పు చేసి, పెద్దల మనసు నొప్పించకూడదనే భావన ఏర్పడుతుంది. భయం అనేది మనిషి సక్రమ మార్గంలో నడవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటారు మనో విశ్లేషకులు.

దేవుడి మీద నమ్మకం ఉన్నవారు...

తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భావన కలిగి, తప్పు చేయడానికి వెనకాడతారు. స్వర్గనరకాల మీద నమ్మకం ఉన్నవారు... పెద్దలను తూలనాడితే నరకానికి పోతామని భయపడతారు. అక్కడ భయంకరమైన శిక్షలు పడతాయి అనే భయం ఉన్నప్పుడు తప్పు చేయడానికి జంకుతారు. అలా కాకుండా... నరకమే లేదు, ఇంక అక్కడికి ఎందుకు పోతాం? అనే భావన ఉంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా తప్పు చేసి తీరతాడు.పరుల సొమ్ము పాము వంటిది అని మనకు ఒక నానుడి వాడకంలో ఉంది. అలాగే, ఇతరుల సొమ్మును హరిస్తే రెట్టింపు సొమ్మును పోగొట్టుకుంటామని పెద్దలు మంచి మాటలు చెప్తారు. ఆ భయమే ఉంటే... పరుల సొమ్ము వైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయరు.తల్లిదండ్రుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తూ, వారిని వీధిన పడేస్తూ, జల్సాగా గడిపేవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. ముందుముందు మన పిల్లలు కూడా ఈ విధంగానే చూస్తారనే భయం కలిగిననాడు పెద్దలను జాగ్రత్తగా చూస్తారు. దేనికైనా సరే భయం ఒక్కటే ఉంటే చాలదు. ఆ భయం గౌరవంతో కూడినది అయి ఉండాలి.తల్లిదండ్రులందు దయలేని పుత్రుండుపుట్టనేమి వాడు గిట్టనేమిపుట్టలోని చెదలు పుట్టవా గిట్టవావిశ్వదాభిరామ వినురవేమ..అన్నాడు వేమన.తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆదరం, దైవం మీద భక్తి, విశ్వాసం... కలిగిన వారు పాపం చేయటానికి సాహసించరని మన పురాణాలు చాటి చెప్తున్నాయి. అహంకారంతో విర్రవీగుతూ, దైవాన్ని దూషిస్తూ, పసిబాలుడైన ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడు... ఆ దైవం చేతిలోనే అతి హీనంగా మరణించాడు. భయభక్తులతో మెలిగిన ప్రహ్లాదుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు.పరస్త్రీని కన్నెత్తి చూసినా, ఆమెను అపహరించినా వినాశనం తప్పదనే భయం లేకుండా, విచ్చలవిడిగా ప్రవర్తించిన దుర్మార్గుల గురించిన కథలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. సీతమ్మను చెరపట్టిన రావణుడి కారణంగా స్వయంగా రావణుడు హతమవ్వటమే కాకుండా, వంశనాశనానికి కారకుడయ్యాడు. నిండు కొలువులో నిర్భయంగా, నిర్లజ్జగా.. ద్రౌపదీ వస్త్రాపహరణం చేసిన దుశ్శాసనుడు, అందుకు ప్రేరేపించిన దుర్యోధన కర్ణాదులు... అందరూ కురుక్షేత్ర యుద్ధంలో నేలకూలారు. అజ్ఞాత వాసం చేస్తూ, తన మానాన్ని కాపాడుకుంటోంది ద్రౌపది. అంతటి పతివ్రతా శిరోమణి పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, నాశనమైపోతానన్న భయం లేనికారణంగా, దుష్ట కీచకుడు ద్రౌపదిని చెరపట్టబోయాడు. భీముని చేతిలో అత్యంత క్రూరంగా మరణించాడు. తన సోదరికి కలిగిన సంతానాన్ని నిర్దాక్షిణ్యంగా కత్తికి బలిచేసిన కంసుడు... శ్రీకృష్ణుని చేతిలో ఘోరంగా కన్నుమూశాడు.ఇటువంటి ఉదాహరణలు మన పురాణాలలో, ఇతిహాసాలలో కోకొల్లలుగా ఉన్నాయి.  వీరందరిలోనూ ఉన్న దుర్గుణం – తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనే భయం లేకపోవడమే. ఇప్పుడు అలాంటి పాఠాలు లేకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయి.మంచి భయం మనిషికి సదా శ్రీరామరక్షగా నిలుస్తుందని పెద్దలు చెప్పిన వాక్యాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.

- డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232