జీవో 46కు మద్దతుగా ట్యాంక్బండ్పై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

జీవో 46కు మద్దతుగా ట్యాంక్బండ్పై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ : జీవో 46కు మద్దతుగా ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన దిగారు. కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో 46పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చే సమయంలో ఉద్యోగాలు రాకుండా కొంతమంది అభ్యర్థులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) జోక్యం చేసుకుని ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 46 ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు కానిస్టేబుల్ అభ్యర్థులు. 2018 నోటిఫికేషన్ ఆధారంగా నియమాకాలు చేపడితే  అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. అన్ని జిల్లాల అభ్యర్థులకు సమన్యాయం జరుగుతుందని భావించే.. రాష్ట్ర  ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ లో జీవో 46ను తీసుకొచ్చిందని వివరించారు. జీవో 46ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. 

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు.. జీవో 46 ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.