కొత్త బడ్జెట్​లో కొన్ని చర్యలు తీసుకోవాలె : ఎకనమిస్టులు

కొత్త బడ్జెట్​లో కొన్ని చర్యలు తీసుకోవాలె : ఎకనమిస్టులు
  • ప్రభుత్వానికి ఎక్స్​పర్టుల సూచన

న్యూఢిల్లీ: దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు నడిపించడానికి కొత్త బడ్జెట్​లో కొన్ని చర్యలు తీసుకోవాలని ఎకనమిస్టులు కేంద్రానికి సూచనలు చేస్తున్నారు. వీటిలో పన్ను మినహాయింపు నుంచి గ్రామాల్లో డిమాండ్​ పెంపు వరకు పలు అంశాలు ఉన్నాయి. వచ్చే నెల 1న  కేంద్ర బడ్జెట్​ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై వివిధ రంగాల ప్రజలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది పన్ను సడలింపులను ఆశిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్. కేంద్ర బడ్జెట్ 2023–-24కు సంబంధించిన ఎకనమిస్టులు చేస్తున్న ఐదు ప్రధాన సూచనలు ఇవి. 

పన్ను మినహాయింపు పరిమితి

పన్ను మినహాయింపు లేదా రాయితీ పరిమితులను పెంచడం ద్వారా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు. భారతదేశంలో ప్రధాన పన్ను చెల్లింపుదారులలో ఉద్యోగులు ఒకరు. ప్రస్తుతం సంవత్సరానికి రూ.2.5 లక్షల వరకు మాత్రమే ఆదాయం ఉంటే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.  జీతం ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఉంటే కూడా పన్ను ఉండదు. అయితే సెక్షన్ 87ఏ కింద రాయితీలు మాత్రమే ఇస్తారు. పూర్తిగా పన్ను మినహాయింపు కాదు. సంవత్సరంలో జీతం రూ. 5 లక్షలకు మించి ఉంటే, మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల మినహా మిగిలి మొత్తంపై పన్ను వర్తిస్తుంది. ఇప్పుడు మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని జనంతోపాటు ఎకనమిస్టులు కోరుతున్నారు.

మరిన్ని రంగాలకు ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్​

ఈసారి బడ్జెట్‌‌లో బొమ్మలు, సైకిళ్లు,  తోలు వస్తువులు,  ఫుట్​వేర్​ ప్రొడక్షన్​కు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపాధి కల్పించే మరిన్ని రంగాలను కవర్ చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్‌​ ఇన్సెంటివ్​ (పీఎల్‌‌ఐ) పథకాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటోమొబైల్స్,  ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్‌‌టైల్స్, ఫుడ్  ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్‌ కెమిస్ట్రీ సెల్‌‌తో సహా 14 రంగాల కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది.  

ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌కు బూస్ట్‌

2024 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం ఎక్కువ కేటాయింపులను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే మౌలిక సదుపాయాలు వృద్ధికి ముఖ్యమైన ఇంజన్. మౌలిక సదుపాయాలను పెంచడానికి మోడీ ప్రభుత్వం ఇది వరకే గతిశక్తి సహా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. గతిశక్తి కింద రూ.7.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు ప్రకటించింది. 

గ్రామాల్లో డిమాండ్​ పెంపు

ఈ ఏడాది గ్రామీణ రంగానికి కూడా ఊపు వచ్చే అవకాశం ఉంది. పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ కృష్ణారావు బుద్ధ మాట్లాడుతూ, “2023–-24 యూనియన్ బడ్జెట్  మార్కెట్లలో ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడానికి,  సమతుల్యం చేయడానికి పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో కూడిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు వారి కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది”అని ఆయన వివరించారు.

ఇన్వెస్ట్​మెంట్ల మినహాయింపు పరిమితి పెంచాలె

నిర్దిష్ట ఇన్వెస్ట్​మెంట్లపై పన్ను చెల్లింపుదారుడు చేసిన పెట్టుబడులకు (సెక్షన్ 80సి) లేదా ఖర్చు చేసిన మొత్తానికి (సెక్షన్ 80 డి లేదా సెక్షన్ 80ఈ) ఆదాయపు పన్ను మినహాయింపులకు అర్హులు అవుతారు. 80సి కింద ప్రస్తుతం రూ. 1.5 లక్షల మినహాయింపు ఉంది. ఈసారి బడ్జెట్‌‌లో సెక్షన్ 80సి కింద తగ్గింపుల పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. రియల్టీ కొనుగోళ్లకు సెక్షన్ 80సీ కాకుండా ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రస్తుత 80సీ పరిమితిని దాదాపు దశాబ్దం క్రితం నిర్ణయించారు.