హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట్ వి.ఎం హోమ్ సమీపంలో.. మెట్రో పిల్లర్ నెంబర్ 1629 దగ్గర కొందరు యువకులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అద్దాలు పగులగొట్టి హంగామా సృష్టించిన ఘటన కలకలం రేపింది. పటాన్‌చెరు– బీరం గూడ నుంచి ఆంధ్రా వైపు వెళ్తున్న SVT ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్‌పై కారులో వచ్చిన అల్లరి మూక దాడి చేసింది. యూ-టర్న్ దగ్గర వారి కారు బస్సుకు తగిలిందని, “మా కారు కంటే స్పీడ్‌గా వెళ్తున్నావు” అంటూ గొడవకు దిగారు.
మత్తులో ఉన్న ఆరుగురు యువకులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైతన్యపురి పెట్రోలింగ్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోగా, పోలీసులను చూసి అల్లరి మూక పరారైంది. బస్సు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
