టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్..కొత్తగా 41మందికి కరోనా

టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్..కొత్తగా 41మందికి కరోనా

హైదరాబాద్‌‌, వెలుగుకరోనా సోకిన వాళ్లలో కొంతమందికి టెస్టులు చేయకుండానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్ వచ్చినవాళ్లను మాత్రమే డిశ్చార్జ్ చేయగా.. బుధవారం 79 మందికి అసలు టెస్టులు చేయకుండానే ఇంటికి పంపించారు. మరో 38 మందికి ఒక టెస్టులో నెగెటివ్ రావడంతో హాస్పిటల్  నుంచి బుధవారం డిశ్చార్జ్‌‌ చేశారు. ఇలా హాస్పిటల్  నుంచి మొత్తం 117 మంది డిశ్చార్జయ్యారు. వీరు హాస్పిటల్‌‌లో చేరి 15 రోజులు దాటిందని, వీళ్లలో ఎవరికీ వైరస్ లక్షణాలు, జ్వరం ఏమీ లేవని డాక్టర్లు చెప్పారు. అంబులెన్స్‌‌లలో వీళ్లను ఇండ్లకు చేర్చామని, ఇండ్లలోనే 14 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని సూచించామన్నారు. వైరస్ పాజిటివ్ వచ్చిన పది రోజుల తర్వాత, వరుసగా 3 రోజులపాటు జ్వరం లేకుంటే టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్ చేయొచ్చని ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌‌(ఐసీఎంఆర్‌‌‌‌) గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసింది. ఈ గైడ్‌‌లైన్స్‌‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగానే వారిని డిశ్చార్జ్  చేసినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

వయా ముంబై

రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సోమవారం 79, మంగళవారం 51 కేసులు నమోదవగా.. బుధవారం 41 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో 31 మంది గ్రేటర్ హైదరాబాద్‌‌కు చెందినవాళ్లే. మరో పది మంది ఇతర రాష్ట్రాల నుంచి తిరిగొచ్చిన వలస కార్మికులని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన ఆరుగురు, జనగాం జిల్లాకు చెందిన ఇద్దరు, భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ పది మంది సహా ఇప్పటివరకూ మొత్తం 35 మంది వలస కార్మికులు కరోనా బారినపడ్డారు. వీళ్లంతా వైరస్ కేంద్రంగా మారిన ముంబై నుంచి వచ్చినవారే.

మరో ఇద్దరు మృతి

బుధవారం వరకు కరోనా కేసుల సంఖ్య 1367కు చేరింది. ఇందులో 822 మంది ఇదివరకే కోలుకోగా, బుధవారం మరో 117 మందిని హాస్పిటల్  నుంచి డిశ్చార్జ్ చేశారు. 394 మంది వివిధ దవాఖాన్లలో ట్రీట్ మెంట్   పొందుతున్నారు. బుధవారం మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 34కు చేరింది. మృతిచెందిన వారిలో హైదరాబాద్‌‌లోని జియాగూడకు చెందిన 38 ఏండ్ల వ్యక్తి, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన 74 ఏండ్ల వృద్ధుడు ఉన్నారు. కితడ్నీ సమస్యతో బాధపడుతున్న ఈ వృద్ధుడ్ని యశోద హాస్పిటల్ నుంచి గాంధీ హాస్పిటల్ కు  రిఫర్ చేశారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌‌లో పేర్కొంది.

వలసలతో ప్రమాదం: ఈటల

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవాళ్లతో కరోనా వైరస్ వ్యాపించే ముప్పు ఉందని రాష్ట్ర హెల్త్  మినిస్టర్  ఈటల రాజేందర్‌‌‌‌  అన్నారు. రాష్ట్ర బార్డర్లలో, రైల్వే స్టేషన్లలో చెక్‌‌పోస్టులు ఏర్పాటు చేసి, బయటి నుంచి వచ్చేవాళ్లందరినీ స్ర్కీనింగ్ చేస్తున్నామని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయించి, లేనివాళ్లను హోంక్వారంటైన్‌‌కు తరలిస్తున్నామని వివరించారు. ‘‘లాక్‌‌డౌన్ సడలింపులతో ఎక్కువ మంది బయటకు వస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో జనాలు తిరిగొస్తుండడంతో కేసులు పెరిగే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు, స్టాఫ్  మరింత అలర్ట్ గా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు, స్టాఫ్ తో గురువారం మంత్రి ఈటల రాజేందర్  వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించనున్నారు.

ఏపీలో మరో 48 కేసులు.. 86 మంది డిశ్చార్జి, ఒక్కరు మృతి

అమరావతి, వెలుగు: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,137కు చేరింది. ఇక 86 మంది డిశ్చార్జి కాగా కోలుకున్న వారి సంఖ్య 1142కు చేరింది. కర్నూలులో ఒకరు మృతి చెందగా మరణాల సంఖ్య 47కు చేరింది. ప్రస్తుతం 948 మంది ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఇటీవల గుంటూర్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడికి పాజిటివ్ రాగా, వారింట్లో మరో నలుగురికి, స్నేహితుడికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 2,10,196 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 32.90 శాతంగా ఉండగా, ఏపీలో 53.44 శాతంగా ఉందని పేర్కొంది. దేశంలో మరణాల రేటు 3.25శాతంగా ఉంటే.. ఏపీలో 2.20 శాతంగా ఉందని చెప్పింది.

టెలీమెడిసిన్‌‌ సేవలకు బైకులు: సీఎం

టెలీమెడిసిన్‌‌ సేవల కోసం కొత్త బైకులను కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. బుధవారం ఆయన అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

రైలు పట్టాలపై నడిస్తే కఠిన శిక్షలు