- వాటితో సిమ్ కార్డులు
- సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్న ఏజెంట్లు
- ఒక్కో సిమ్‌కు రూ.3వేల వరకు వసూలు
- ఫోన్ నంబర్స్ ట్రేస్ చేస్తున్నా తప్పించుకుంటున్న క్రిమినల్స్
- సిమ్‌లో ఉన్న అడ్రస్‌లో బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు
హైదరాబాద్, వెలుగు: బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు, చిన్న పిల్లల పేర్లతో ఫేక్ ఆధార్ కార్డులు తీసుకుంటున్న కొందరు.. వాటి సాయంతో సిమ్ కార్డులు కొంటున్నారు. ఈ సిమ్‌కార్డులను సైబర్ నేరగాళ్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఫోన్ నంబర్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో కూర్చొని ఇండియాలోని బ్యాంకు ఖాతాలను కొల్లగొడ్తున్నారు. కొన్నేండ్లుగా ఈ తరహా కేసులు సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. ఆన్‌లైన్ అడ్డాగా ఏటా వేల కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లను గుర్తించడంలో ఇలాంటి సిమ్ కార్డులు అడ్డంకిగా మారుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ వినియోగిస్తున్న ఫోన్ నంబర్లను గుర్తించినప్పటికీ.. సిమ్ కార్డులు మాత్రం బిచ్చగాళ్లు, చిన్నారులు, అడ్డా కూలీల పేర్ల మీద ఉండటంతో ఇన్వెస్టిగేషన్ ఆగిపోతున్నది.
1930కి వచ్చే ఫిర్యాదులతో డబ్బులు ఫ్రీజ్ చేయడం తప్ప.. సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయలేకపోతున్నామని పోలీసులు చెప్తున్నరు.
ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్అడ్డాలుగా మోసాలు
ఢిల్లీ, ముంబై, వెస్ట్ బెంగాల్, దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నరు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌తో పాటు ఆన్‌లైన్ మోసాల్లో ఫేక్ సిమ్ కార్డులను వినియోగిస్తున్నరు. ఇక్కడి సిమ్ కార్డులను దుబాయ్‌లోనూ ఆపరేట్ చేస్తున్నరు. దీని కోసం దేశవ్యాప్తంగా లోకల్ ఏజెంట్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నరు. కమీషన్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, బిచ్చగాళ్లు, చిరు వ్యాపారుల పేర్లతో సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నరు. రాజస్థాన్, భరత్పూర్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌లో ఫేక్ సిమ్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో కాల్‌డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిరాశే మిగులుతున్నది. సిమ్ కార్డులో ఉన్న అడ్రస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ ఉండటం లేదు. అసలు నేరస్తులు తప్పించుకోగా.. అమాయకులే పోలీసులకు చిక్కుతున్నరు.
రెండేండ్లలో8,621 ఫేక్ బ్యాంక్ అకౌంట్ల గుర్తింపు
గడిచిన రెండేండ్లలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 8,621 ఫేక్ బ్యాంక్ అకౌంట్స్, 28,319 ఫేక్ ఫోన్ నంబర్స్‌ను పోలీసులు గుర్తించారు. ఇందులో హైదరాబాద్‌లో నమోదైన కేసుల్లో 113 అకౌంట్స్ దాదాపు 12వేలకు పైగా నకిలీ సిమ్‌కార్డులను గుర్తించారు. ఇవన్నీ ఫేక్ బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు కొన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నరు. ఆ అడ్రస్‌కు పోతే బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు ఉంటున్నరు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో యాక్షన్ ప్లాన్
నార్త్ ఇండియా ఏజెంట్లు మాత్రం సైబర్ నేరగాళ్లకు ఒక్కో సిమ్ కార్డును రూ.200 నుంచి రూ.500కు అమ్ముకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ వివరాలను సేకరించింది. సిమ్‌కార్డుల అమ్మకాల్లో వెరిఫికేషన్ లోపాలు ఉన్నట్టు గుర్తించింది. ఓటీపీ అథెంటికేషన్లోనూ అనేక లోపాలు ఉన్నట్టు ‘టెలికామ్ సిమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రాడ్స్గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రికమండేషన్స్’ నివేదిక వెల్లడించింది. ప్రజలు పోగొట్టుకున్నా, చోరీకి గురైన సెల్‌ఫోన్స్‌లోని సిమ్‌కార్డులు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నట్లు గుర్తించింది.
‘‘హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభాని, జీడిమెట్ల చింతల్‌కు చెందిన నవీన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ ‘‘ఇండియన్ సిమ్ కార్డ్స్ సేల్” ‘‘ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ సేల్’’ పేరుతో టెలిగ్రామ్‌లో అకౌంట్స్ ఓపెన్ చేశారు. అందులో ఇండియన్ సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ అమ్మకానికి పెట్టారు. దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడే చైనీస్లకు ఒక్కో సిమ్ కార్డును రూ.1,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నారు. ఈ గ్యాంగ్‌ను జూన్ 19న స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఫేక్ ఆధార్లతో సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా, ఆధార్ కార్డుల్లో ఉన్న అడ్రస్‌లకు వెళ్లి వెతకగా ఆయా పేర్లపై బిచ్చగాళ్లు, అడ్డా కూలీలు, పిల్లలు ఉన్నట్లు గుర్తించారు’’
