పరిగిలో ధర్నా చేసింది కర్నాటక రైతులు కదా...? వాళ్లు కూలీలా...?

పరిగిలో ధర్నా చేసింది కర్నాటక రైతులు కదా...? వాళ్లు కూలీలా...?

వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల పేరిట కొందరు వ్యక్తులు ప్లకార్డులతో హల్ చల్​చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. కొడంగల్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.  అయితే.. నిరసనకారుల ర్యాలీకి స్థానికంగా ఉండే కొందరు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపుతూ వారికి దారి చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ర్యాలీని స్థానికంగా ఉన్న కాంగ్రెస్​నాయకులు అడ్డుకుని.. ప్లకార్డులు చింపేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఎన్నికల సమయంలో స్థానికేతరులు నిరసనలు చేసేందుకు ఎలా అనుమతులు ఇస్తారంటూ పోలీసులను  కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. రైతుల నిరసనలకు పోటీగా కాంగ్రెస్ నాయకులు కూడా ర్యాలీ నిర్వహించారు. 

గొడవ పెద్దదవుతున్న క్రమంలో నిరసన చేపట్టేందుకు వచ్చిన వ్యక్తులు.. వెంట తెచ్చుకున్న ప్లకార్డులను మార్కెట్ యార్డులోనే వదిలేసి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కొందరు తమ వాహనంలో వెళ్లిపోగా.. ఐదుగురు మాత్రం పరిగిలోనే ఉండిపోయారు. వారిని కాంగ్రెస్ నాయకులు గుర్తించి..  ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వీరంతా కేవలం300 రూపాయల కూలీ కోసం ఓ ఏజెంట్ ద్వారా రైతుల వేషంలో పరిగికి వచ్చారని తేలింది. 

సదరు ఏజెంట్​ఎలా చెబితే తాము అలా చేశామని, చివరకు తమను పరిగిలోనే వదిలి వెళ్లిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కోట్రిక నుండి తాము వచ్చామని, 300 రూపాయలు ఇస్తామంటే వాహనంలో ఎక్కుంచుకుని వచ్చారని తెలిపారు. తమతో పని చేయించుకున్నాక.. వదిలి వెళ్లిపోయారని కర్ణాటక వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.