
- ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల పేరిట దందా చేస్తున్నరు
- ఇద్దరు ప్రజాప్రతినిధులు స్పందించి పైసలిప్పించాలె
- లేకపోతే బండారం బయటపెడతా
- ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట కొందరు ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు కోట్లాది రూపాయలు వసూలు చేశారని, వాటిని వెంటనే బాధితులకు తిరిగివ్వాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరులు సుమారు రూ.40 కోట్ల వరకు వసూళ్లు చేశారని, ఆ డబ్బుతో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇప్పించేందుకు మంత్రి, ఎమ్మెల్యే మందుకు రావాలని, లేకపోతే వారి బండారం బయట పెడతానని ప్రకటించారు. ఆర్ఎఫ్‌సీఎల్ బాధితులకు న్యాయం చేయకపోతే వారిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళతానని ప్రకటించారు. అక్కడా వారికి న్యాయం జరగకపోతే గవర్నర్ వద్దకు వెళతామన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితుల కోసం తాము పోరాడతామన్నారు. ఇందుకోసం అవరసమైతే కోర్టుకు పోతామని, హైదరాబాద్‌లో ధర్నా చేస్తామన్నారు.
మంత్రి బావ భూకబ్జా
మంత్రి కొప్పుల ఈశ్వర్ బావ, అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ రామగుండంలో తెలంగాణ జెన్ కో కు చెందిన ఎకరం భూమిని కబ్జా చేశారని, దానిలో బ్రిక్స్ ఫ్లాంట్‌ను పెట్టారన్నారు. ఆ భూమిని తిరిగివ్వకపోతే ఆందోళన చేస్తామన్నారు. రామగుండంలో ఇసుక, బూడిద, భూముల మాఫియా నడుస్తోందని ఈ దందాలు మానకపోతే ప్రజాప్రతినిధులకు రాబోయే ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. మీటింగ్‌లో లీడర్లు గుమ్మడి కుమారస్వామి, అంబటి నరేశ్ పాల్గొన్నారు.