కొత్త అల్లుడిని గాడిదపై తిప్పుతరు

కొత్త అల్లుడిని గాడిదపై తిప్పుతరు

హోలీ పండక్కి కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాద చేస్తారు ఎవరైనా. కానీ ఈ ఊర్లో మాత్రం హోలీ రోజున కొత్త అల్లుడిని గాడిద మీద ఊరేగిస్తారు. అలా ఎందుకు చేస్తారంటే.. అది వాళ్ల ఆచారంలో భాగం. తొంభై ఏండ్లుగా వస్తోంది ఈ ట్రెడిషన్. ఈ వింత ఆచారం మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో ఉన్న విద అనే గ్రామంలో ఉంది. హోలీ పండుగ నాలుగు రోజుల్లో ఉందనగా... ఊరివాళ్లంతా కలిసి తమ ఊరి ఆడపిల్లను పెండ్లి చేసుకున్న కొత్త పెండ్లి కొడుకుని గుర్తిస్తారు. హోలీ రోజున గాడిద ఊరేగింపు నుంచి తప్పించుకోకుండా  అతడిని ఓ కంట కనిపెడతారు. పండుగ రోజు ఉదయాన్నే ఆ కొత్త అల్లుడికి కొత్త బట్టలు ఇచ్చి, మెడలో దండ వేసి, రంగులు పూస్తారు. తర్వాత గాడిద మీద ఊరేగిస్తారు. ఊరి మధ్యలో మొదలైన ఈ ఊరేగింపు, అక్కడి ఆంజనేయుడి గుడి దగ్గరకు చేరుతుంది. ఆ ఊరికి చెందిన ఆనంద్​రావు దేశ్​ముఖ్​తో మొదలైంది ఈ ఆచారం. ఆయన తన అల్లుడిని హోలీ రోజున గాడిద మీద ఊరంతా తిప్పాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా హోలీకి ఈ ట్రెడిషన్​ పాటిస్తున్నారు.