
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26 నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామప్ప, భద్రాచల ఆలయాలను సందర్శించనున్నారు. అలాగే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్టప్రతి మార్గంలో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు సీఈవోలను సోమేష్ కుమార్ ఆదేశించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రపతి నిలయంలో ప్రొటోకాల్ ను అనుసరించి 24 గంటల పాటు విద్యుత్తు శాఖ, వైద్య బృందాలను నియమించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.
దక్షిణాది విడిది కోసం ప్రతి ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. అయితే కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. రాష్ట్రపతి అయ్యాక ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.