
హైదరాబాద్, వెలుగు: కన్నతల్లి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి..ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 11 ఏండ్లు జైల్లో ఉన్నాడు. ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పుతో అతనికి జైలు జీవితం నుంచి విముక్తి కలిగింది. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లికి చెందిన పెద్దగుండెల్లి అలియాస్ పెద్దగుండేల పోచయ్య తల్లి(80) ఉరేసుకుని చనిపోయింది. దీంతో పోచయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడే తన తల్లిని గొంతు నులిమి చంపేసి.. చెట్టుకు ఉరి వేసుకున్నట్లుగా సీన్ క్రియేట్ చేశాడని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. తల్లిని పోషించలేకే ఆమెను పోచయ్య చంపేశాడని చెప్పారు.
అయితే, తన తల్లి అనారోగ్యంతో విసిగిపోయి చెట్టుకు ఉరివేసుకుందని పోచయ్య కోర్టుకు వివరించాడు. పోచయ్య వాదనను పక్కన పెట్టిన సిద్దిపేట కోర్టు.. అతడికి 2013 జనవరి 12న యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పును రద్దు చేయాలని, తనపై నమోదైన కేసును రద్దు చేయాలని పోచయ్య హైకోర్టును ఆశ్రయించాడు. పోచయ్య దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. డాక్టర్ నివేదికలో వృద్ధురాలిది హత్యా లేక ఆత్మహత్యా అనేది స్పష్టంగా లేదని తెలిపింది. వృద్ధురాలు చనిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షులు కూడా లేరని వెల్లడించింది. ఊహలు, అంచనాల ఆధారంగా కోర్టులు తీర్పులు వెలువరించడానికి వీల్లేదని చెప్పింది. పోచయ్యపై ఎలాంటి కేసులు లేకపోతే వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.