ములుగు, వెంకటాపూర్, వెలుగు: బావిలో పడిన లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకులు మృతిచెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామానికి చెందిన రసపూత్ రాజు(43) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తమ లేగదూడ గడ్డి మేస్తూ ఓ ఇంటి వద్ద గల నీళ్లు లేని బావిలో పడిపోయింది.
విషయం తెలుసుకున్న రాజు తన కొడుకు పవన్(27)తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇద్దరూ లేగదూడను బయటికి తీసేందుకు ఆ బావి వద్దకు వెళ్లారు. రాజు లోపలికి దిగి లేగదూడకు తాడు కట్టి పైకి లాగమని పవన్‌కు చెప్పాడు. దూడను పైకి లాగిన తరువాత తండ్రి రాజు స్పందించకపోవడంతో పవన్ కూడా బావిలోకి దిగాడు.
లోతు ఎక్కువగా ఉండటం, ఆక్సిజన్ అందకపోవడంతో ఊపిరాడలేదు. దీంతో ఇద్దరూ ఆ బావిలోనే మృతిచెందారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
