
జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. భూమిని అమ్మినందుకు తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కొడుకు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన తండ్రి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్యన ఉన్నాడు.
అసలేం జరిగిందంటే...రాయికల్ మండలానికి చెందిన లక్ష్మీ నర్సయ్యకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహమై విడాకులు తీసుకుని ఇంటి దగ్గర ఉంటోంది. ఇటీవల అప్పు చేసి చిన్న కూతురికి పెళ్లి చేశాడు . చేసిన అప్పులు తీర్చేందుకు తండ్రి లక్ష్మీ నర్సయ్య 10 గుంటల భూమిని అమ్మేశారు. అయితే ఈ విషయం తెలిసిన కొడుకు రాజేందర్ ఆగ్రహంతో తన స్నేహితుడు అస్లాంతో కలిసి తన తండ్రిపై కత్తులతో దాడి చేశాడు. లక్ష్మీనర్సయ్యను కత్తులతో కడుపులో 8 చోట్ల పొడిచారు. దీంతో తీవ్ర గాయాలైన లక్ష్మీ నర్సయ్యను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు వైద్యులు. దాడి అనంతరం నిందితుడు రాజేందర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.