అదనపు కట్నం ఇవ్వడం లేదని అత్తింటిపై అల్లుడి కాల్పులు

 అదనపు కట్నం ఇవ్వడం లేదని అత్తింటిపై అల్లుడి కాల్పులు

బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాలిగామలో అదనపు కట్నం ఇవ్వాలంటూ ఓ అల్లుడు అత్తామామల ఇంటిపై గన్​తో కాల్పులు జరిపాడు. బెల్లంపల్లి మండలం మాల గురజాలకు చెందిన గొమాస నరేందర్​కు కన్నెపల్లి మండలం సాలిగామకు చెందిన గోలేటి శంకర్, లక్ష్మి దంపతుల పెద్ద బిడ్డ బేబితో నాలుగేండ్ల క్రితం పెండ్లి జరిగింది. తర్వాత నరేందర్ కరీంనగర్ వెళ్లి అక్కడ పేపర్ ప్లేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదనపు కట్నం కోసం బేబీని నిత్యం వేధిస్తున్నాడు. భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని అత్తామామలపై ఒత్తిడి తెస్తున్నాడు. రెండ్రోజుల క్రితం భార్యను చితకబాదాడు. మంగళవారం అర్ధరాత్రి సాలిగామకు వెళ్లి స్నేహితుడు మహేశ్​తో కలిసి మద్యం తాగాడు. రాత్రి11.30 గంటలకు తన వద్ద ఉన్న పిస్టల్​తో అత్తామామల ఇంటి మెయిన్​డోర్​పై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.

దీంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో వణికిపోయారు. శబ్దం విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరూ పారిపోయారు. బాధితులు బుధవారం ఉదయం కన్నెపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పరిశీలించారు. తూటాలను స్వాధీనం చేసుకున్నారు. నరేందర్​కు పిస్టల్​ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరుపుతున్నారు. ఏసీపీ వెంట సీఐ శ్రీనివాస్, భీమిని ఎస్ఐ ప్రశాంత్​ఉన్నారు.