
మరికొద్ది రోజుల్లో తన పెళ్లి జరుగుతుందనుకున్న సమయంలో తన తండ్రి మరణం ఆ యువకుడిని కలచివేసింది. తన జీవితంలో ముఖ్య ఘట్టం తండ్రి సమక్షంలో జరగడం లేదన్న విషయం గ్రహించిన అతడు ఓ కీలక నిర్ణయం తీసుకొని అందరి గుండెల్ని కదిలించేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా దిండివనం గ్రామానికి చెందిన అలగ్జాండర్ (30) ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జగదీశ్వరి(27)తో ని ప్రేమించిన అలెగ్జాండర్ తమ ప్రేమ గురించి రెండు కుటుంబాలను ఒప్పించాడు. సెప్టెంబరు 2వ తేదీ మైలం సుబ్రమణ్యస్వామి ఆలయంలో వారి వివాహాం ఖాయమైంది.
అంతా మంచే జరుగుతోందనుకున్న క్రమంలో.. అలెగ్జాండర్ తండ్రి దైవమణి అనారోగ్య కారణంగా పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. దీంతో తండ్రి సమక్షంలోనే వివాహం జరగాలని నిర్ణయించుకున్న అలెగ్జాండర్.. తండ్రి భౌతికకాయం వద్దే తన వివాహం జరగాలని చెప్పాడు. అందుకు రెండు కుటుంబాలవారు అంగీకరించారు. తన ఇంటిలోనే వివాహ వేదికగా అలంకరించి, దైవ మణి మృతదేహానికి పట్టు వస్ర్తాలు కట్టించి, పక్కనే తల్లిని కూడా పట్టువస్ర్తాలతో ముస్తాబు చేశాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ తనకు నిశ్చయమైన యువతి మెడలో తాళి కట్టాడు. శోకపూరిత వాతావారణంలో జరిగిన ఈ పెళ్ళికి ఇరువైపు బంధువులూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.