'ద ఘోస్ట్'లో నా డ్రీమ్ రోల్ చేశా

'ద ఘోస్ట్'లో నా డ్రీమ్ రోల్ చేశా

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. ఈ చిత్రంలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా నాగార్జున కనిపించబోతున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయికగా అలరించనుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నది. ఈ నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.  

తెలుగులో ఎక్కువ విరామం తీసుకున్నట్లుగా ఉన్నారు?
ఎఫ్3లో క్యామియో రోల్ చేశాను. ఇక విరామం అంటే.. కోవిడ్ కారణంగా మొత్తం ఇండస్ట్రీనే విరామం తీసుకుంది కదా. హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అయితే తెలుగు నా ఫస్ట్ లవ్.

'ది ఘోస్ట్' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
యాక్షన్ సినిమాలు చేయాలని ఉండేది. ప్రవీణ్ సత్తారు క్రియేటివ్ డైరెక్టర్. ఈ కథ చెప్పినపుడు చాల థ్రిల్ అనిపించింది. నాగార్జున ఈ ప్రాజెక్ట్ ఉన్నారని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యా. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తాను.

ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించడానికి ఎలాంటి కసరత్తు చేశారు?
ఇందులో శారీరకంగా, మానసికంగా చాలా సవాల్ తో కూడుకున్న పాత్ర చేశాను. ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. యాక్షన్ తో పాటు ఎంఎంఎ శిక్షణ పొందాను. అయితే శిక్షణలో రెండో రోజే నా కాలివేలు ఫ్రాక్చర్ అయ్యింది. చిన్న గాయమే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్ రే తీయమని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ శిక్షణలోకి వచ్చాను. అలాగే ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాను.

గన్ పట్టుకోవడం ఇదే తొలిసారా?
లేదు. మా నాన్న పోలీస్ ఆఫీసర్ కావడం వలన గన్స్ తో నాకు పరిచయం ఉంది (నవ్వుతూ). అయితే ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్ ని పట్టుకోవడం, లోడ్ చేయడం, వాటిని హ్యాండిల్ చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. దాదాపు రెండు నెలలు పైగా శిక్షణ సాగింది. అలాగే డైలాగ్ డిక్షన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధపెట్టాను. ఒక నటిగా చాలా తృప్తిని ఇచ్చిన చిత్రమిది. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఒక డ్రీమ్ టీంతో కలసి పని చేయడం గొప్ప ఆనందం ఇచ్చింది. నిజంగా ఇందులో నా పాత్ర ఒక డ్రీమ్ రోల్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా చూసిన తర్వాత కేవలం గ్లామరస్ పాత్రలోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయగలనే నమ్మకం కుదురుతుందని భావిస్తున్నాను.  

నాగార్జునతో పని చేయడం ఎలా అనిపించింది?
నాగార్జునతో పని చేయడం ఒక డ్రీమ్. ఆ కల ఈ సినిమాతో తీరింది. నాగార్జునకి నేను పెద్ద అభిమానిని. ఆయన్ని కలసినప్పుడు కాస్త నెర్వస్ గా ఫీలయ్యా. అయితే పది నిమిషాల మాట్లాడిన తర్వాత నా భయం అంతా పోయింది. నాగార్జున చాలా గ్రేట్ పర్సన్. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. నాగార్జున కింగ్ అఫ్ రొమాన్స్. వేగం పాటలో మా కెమిస్ట్రీ చూసేవుంటారు. అయితే 'ది ఘోస్ట్' యాక్షన్ థ్రిల్లర్. నాగార్జునతో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది. (నవ్వుతూ).

ప్రభాస్, నాగార్జున, వెంకటేష్.. ఇలా వరుసగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు కదా.. తెలుగులో మీ టైం స్టార్ట్ అయ్యిందని అనుకోవచ్చా?
వరుసగా బిగ్ స్టార్స్ తో పని చేయడం నా అదృష్టంగా భావిస్తా. నేను ఎక్కువగా పాత్రపై ద్రుష్టి పెడతా. మంచి పాత్రలతో పాటు బిగ్ స్టార్స్ ఉన్న సినిమాలు రావడం ఆనందంగా ఉంది.

దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో పని చేయడం ఎలా అనిపించింది?
ప్రవీణ్ సత్తార్ చాలా క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. ఆయన చాలా నీట్ గా హోమ్ వర్క్ చేసుకుంటారు. దీంతో సెట్స్ లో ఎలాంటి కన్ఫ్యుజన్ ఉండదు. మిగతా నటీనటుల పని ఈజీ అవుతుంది. ఆయన చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు.

ఈ చిత్రంలో మీరు ఎన్ని యాక్షన్ బ్లాక్స్ లో కనిపిస్తారు?
నాకు ఇందులో రెండు మెయిన్ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ది ఘోస్ట్ కంప్లీట్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్.

జయాపజయాలని ఎలా తీసుకుంటారు?
నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. చాలా సాంప్రదాయ రాజ్ పుత్ కుటుంబం నుండి వచ్చాను. యాక్టింగ్ మాట పక్కన పెడితే మాకు ఇంటి నుండి బయటికి రావడమే గొప్ప. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చాను. ప్రతిది ఇక్కడే నేర్చుకున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని ఎలా తీసుకోవాలో కూడా ఇండస్ట్రీనే నేర్పింది.

కొత్త చేయబోతున్న సినిమాలు?
రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి. త్వరలోనే వివరాలు తెలుస్తాయి