ప్రియాంక గాంధీని కలిసిన కాల్పుల బాధితులు

ప్రియాంక గాంధీని కలిసిన కాల్పుల బాధితులు

దాదాపు 20 గంటల నిరసనలు, ఉద్రిక్త పరిస్థితుల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ .. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర జిల్లా కాల్పుల బాధితులను కలుసుకున్నారు. సోన్ భద్ర జిల్లా ఉంభా గ్రామంలో జులై 17న జరిగిన కాల్పుల్లో చనిపోయిన 10మందికి సంబంధించిన కుటుంబసభ్యులను కలుసుకునేందుకు ఆమె శుక్రవారం ఆ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐతే..ఉద్రిక్తతల కారణంగా పోలీసులు ఆమెను మీర్జాపూర్ జిల్లా చునార్ లో అడ్డుకున్నారు. నిరసనగా ఆమె అక్కడే రోడ్డుపై బైటాయించారు.

గెస్ట్ హౌజ్ లో పవర్ లేదు

చునార్ గెస్ట్ హౌజ్ లోనే రాత్రంతా ప్రియాంకగాంధీ , పార్టీ వర్కర్లు క్యాండిల్ లైట్ల వెలుతురులోనే గడిపారు. బాధితులను కలిసేవరకు వెనక్కి వెళ్లేది లేదని ప్రియాంక పట్టుదల ప్రదర్శించారు. యూపీ అధికారులు పలుమార్లు వెళ్లి ఆమెతో చర్చలుజరిపినా కూడా ఆమె ససేమిరా అన్నారు.

శనివారం ఉదయం ఉంభా గ్రామ గిరిజన కుటుంబాలకు చెందిన ఇద్దరు బాధితులు ప్రియాంక గాంధీని ఆమె బసచేసిన గెస్ట్ హౌజ్ లో కలిశారు. పోలీసులు తీరు ఏమాత్రం బాగాలేదని ఈ సందర్భంగా ప్రియాంకగాంధీ విమర్శించారు. తనను కలిసేందుకు వచ్చిన 15 మంది బాధితులను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. కేవలం ఇద్దరికే అనుమతి ఇచ్చారని చెప్పారు. వీళ్లు చేసిన పాపం ఏంటి.. యూపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ కుటుంబాలకు అన్యాయం జరిగింది అని ప్రియాంక గాంధీ అన్నారు.