ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్.. కాంగ్రెస్​ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నరు: సోనియా

ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్.. కాంగ్రెస్​ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నరు: సోనియా
  • ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్రు
  • మా పార్టీపై మోదీ, అమిత్ షా కక్ష కట్టిన్రు 
  • ఇలా అయితే.. ప్రజాస్వామ్యం బతకదని కామెంట్
  • ఐటీ, పెనాల్టీలు కాంగ్రెస్​కే వర్తిస్తాయా?: ఖర్గే
  • బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతున్నదని ఫైర్
  • రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బుల్లేవు: రాహుల్

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల ముందు కాంగ్రెస్​ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఇన్​కమ్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ సాయంతో తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

మోదీ, అమిత్ షా కలిసి కాంగ్రెస్​పై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆమె ఫైర్ అయ్యారు. ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికే ఎంతో ప్రమాదకరమని అన్నారు. కావాలనే తమ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ను బలహీనపర్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. పార్టీ అకౌంట్ల ఫ్రీజ్, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ గురువారం మీడియాతో మాట్లాడారు. 

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నెల రోజుల కింద మా పార్టీ అకౌంట్లన్నీ ప్రధాని నరేంద్ర మోదీ ప్లాన్ ప్రకారం ఫ్రీజ్ చేయించారు. ఈ ఇష్యూని చాలా సీరియస్​గా తీసుకోవాలి. ఇది మా ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు.. దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే.. దేశంలో ప్రజాస్వామ్యం బతకదు. మా అనుమతి లేకుండా బలవంతంగా అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారు’’అని సోనియా ఆరోపించారు. 

ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై విచారణ జరగాల్సిందే: సోనియా

ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులు వాడుకోకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని సోనియా మండిపడ్డారు. మోదీ, అమిత్ షాపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్​కు 11శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయి. అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం 56శాతం నిధులు వచ్చాయి. కాంగ్రెస్​తో పోలిస్తే బీజేపీకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వారి ఖాతాల్లో పడ్డాయి. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం కోర్టు తీర్పును సమర్థిస్తున్నాం. 

ఈ బాండ్ల ద్వారా బీజేపీ మాత్రమే లాభపడింది. ఈ వ్యవహారంపై విచారణ జరగాల్సిందే. బీజేపీకి ఎవరెన్ని నిధులు ఇచ్చారో బయటపెట్టాల్సిందే. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.210 కోట్ల బకాయిలు, పెనాల్టీలు చెల్లించాలంటూ ఐటీ డిపార్ట్​మెంట్ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేసింది. అకౌంట్​లో ఉన్న రూ.115 కోట్లు వాడుకోకుండా చేసింది’’అని వివరించారు. 

కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇన్​కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్​లో పిటిషన్​పై విచారిస్తున్న టైమ్​లోనే మూడు ఖాతాల నుంచి రూ.65 కోట్లు విత్ డ్రా చేశారని ఆరోపించారు. ఓవైపు ఎన్నికల బాండ్ల వ్యవహారం.. మరోవైపు దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడి జరుగుతున్నదన్నారు. అయినా, ఎన్నికల్లో తాము సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

అకౌంట్లు డీ ఫ్రీజ్ చేయండి: మల్లికార్జున ఖర్గే

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అకౌంట్లను డీ ఫ్రీజ్ చేయాలని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు బీజేపీ వెనకేసుకున్నదని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి ఎన్ని నిధులు అందాయనే విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

అధికారంలో ఉన్నంతమాత్రాన.. రాజ్యాంగ సంస్థలను ప్రత్యక్ష లేదా పరోక్షంగా నియంత్రించకూడదని సూచించారు. ఇన్ కమ్ ట్యాక్స్​లు, పెనాల్టీలు కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తాయా.. బీజేపీకి వర్తించవా? అని నిలదీశారు. ‘‘బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 56శాతం నిధులు వచ్చాయి. అలాంటప్పుడు ఐటీ శాఖకు ఎన్ని కోట్లు పన్నుల రూపంలో కట్టింది? లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో లెవెల్‌‌‌‌ ప్లేయింగ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ ఉండాలి. 

కానీ.. రూలింగ్ పార్టీ మా అకౌంట్లు ఫ్రీజ్ చేయించి డేంజర్ గేమ్ ఆడుతున్నది. ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరం. అడ్డదారిలో డబ్బులు కలెక్ట్ చేసుకుని.. ఫైవ్ స్టార్ హోటల్స్​లో ఆఫీసులు పెడ్తున్నరు. ఎక్కడ మీటింగ్ ఉన్నా బీజేపీ లీడర్లు విమానాల్లో జర్నీలు చేస్తున్నరు. ఒక్క మీటింగ్ కోసం చేసే ఖర్చులో ప్రతిపక్షం 10శాతం కూడా చేయడం లేదు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలపై కేంద్రమే పెత్తనం చేస్తున్నది’’అని ఆరోపించారు.

లూటీ చేసిన డబ్బులు బయటికి తీయండి: నడ్డా

లోక్​సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు డబ్బుల్లేవంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు నవ్వులు తెప్పిస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. తమ పాలనలో పాల్పడిన స్కామ్స్ ద్వారా వచ్చిన డబ్బులను ఎలక్షన్ క్యాంపెయిన్​కు ఉపయోగించుకోవచ్చని అన్నారు. మోదీ, అమిత్​షాను నిందించడం కరెక్ట్ కాదని తెలిపారు. కాంగ్రెస్​ను ప్రజలందరూ తిరస్కరించబోతున్నారని తెలిపారు. 

చరిత్రాత్మక ఓటమిని ఆ పార్టీ మూటగట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉందన్నారు. ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా నిబం ధనలకు లోబడి పని చేస్తుందని స్పష్టం చేశారు. పన్నులు చెల్లించాల్సిందిగా నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ప్రతీ రాష్ట్రంలో.. ప్రతీ సెక్టార్​ను కాంగ్రెస్ లూటీ చేసిందని, అలా వచ్చిన డబ్బులు బయటికి తీసి ప్రచారం చేసుకోవాలని సూచించారు.

యాడ్స్ ఇవ్వలేక పోతున్నం: రాహుల్

కాంగ్రెస్ ‘ఫైనాన్షియల్ ఐడెంటిటీ’ని నెల కింద బీజేపీ ప్రభుత్వం తుడిచిపెట్టేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ విమర్శించారు. సరిగ్గా లోక్​సభ ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ చర్యకు పాల్పడిందని మండిపడ్డారు. కేంద్రం తమ పార్టీ అకౌంట్లను మాత్రమే ఫ్రీజ్ చేయలేదని.. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూడా ఫ్రీజ్ చేసిందని విమర్శించారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసని అన్నారు. ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయలేకపోతున్నా మని, ప్రచారం కోసం ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. 

తమ నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నామ న్నారు. ఫ్లైట్ జర్నీ కాకపోయినా.. కనీసం రైలు టికెట్లు కొనడానికి కూడా డబ్బుల్లేవని అన్నారు. ‘‘1990 కాలంలో ఐటీ శాఖ నుంచి ఒక నోటీసు వచ్చింది. తర్వాత ఏడేండ్ల కింద మరో నోటీసు వచ్చింది. అప్పుడు క్వాంటం అమౌంట్ రూ.14లక్షలు. కానీ.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాకు విధించిన శిక్ష ఏంటంటే.. ఎన్నికల్లో పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీసింది. 

నెల రోజుల్లోనే ఆర్థికపరమైన గుర్తింపును తుడిచిపెట్టేసింది. ఈ రూపంలో మా పార్టీపై మోదీ, అమిత్ షా కలిసి క్రిమినల్ యాక్షన్ తీసుకుంది. దేశంలో ఎక్కడైనా.. ఏ పార్టీకి అయినా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. దాని వెనుక వారిద్దరే ఉంటారు’’అని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా.. ఏ కోర్టు స్పందించడం లేదని, ఎన్నికల కమిషన్ నోరు మెదపడ లేదని, ఏ సంస్థ విమర్శించడం లేఆదని మండిపడ్డారు. తాము ‘అసుర శక్తి’కి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు.