హైదరాబాద్: 2009 డిసెంబర్ 9 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వచ్చిన రోజు.. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజు. అందుకే డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9వ తేదీనే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు.
గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం శుభపరిణామన్నారు. మంగళవారం (డిసెంబర్ 9) ఫ్యూచర్ సిటీ ప్రాంగణం నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని కలెక్టరేట్లలో వర్చువల్గా తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009, డిసెంబర్ 9 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన రోజని గుర్తు చేశారు.
అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం ఈ ప్రాంతానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చిన ఘనత సోనియా గాంధీదేనన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిన డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం మరో విశేషమని అన్నారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు సోనియమ్మ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
►ALSO READ | ఎలక్షన్ డ్యూటీకి గైర్హాజరైతే చర్యలు తప్పవు : కలెక్టర్ విజయేందిర బోయి

