V6 News

ఎలక్షన్ డ్యూటీకి గైర్హాజరైతే చర్యలు తప్పవు :  కలెక్టర్  విజయేందిర బోయి 

ఎలక్షన్ డ్యూటీకి గైర్హాజరైతే చర్యలు తప్పవు :  కలెక్టర్  విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎలక్షన్​ డ్యూటీకి గైర్హాజరయ్యే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్  విజయేందిర బోయి హెచ్చరించారు. పీవోలు, ఓపీవోలు, ఇతర సిబ్బందికి నిర్దేశించిన డ్యూటీలు తప్పనిసరిగా చేయాలన్నారు. మూడు విడతల్లో నిర్వహించే ఎలక్షన్లను అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేసి సక్సెస్​ చేయాలని సూచించారు.

 పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి..

ఎన్నికల డ్యూటీలు చేసే ఉద్యోగులు, అధికారులు పోస్టల్  బ్యాలెట్ ను వినియోగించుకోవాలని కలెక్టర్  విజయేందిర బోయి సూచించారు. విధులు నిర్వర్తించే మండలాల్లోని ఎంపీడీవో ఆఫీసుల్లో ఓటింగ్  ఫెసిలిటేషన్  సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగే గండీడ్, మహ్మదాబాద్, నవాబ్ పేట్, రాజాపూర్, మహబూబ్ నగర్ రూరల్  మండలాల్లో 9న ఫెసిలిటేషన్  సెంటర్  అందుబాటులో ఉంటుందని చెప్పారు.

రెండవ దశ ఎన్నికలు జరిగే హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్ కొండ, కౌకుంట్ల, మిడ్జిల్  ఎంపీడీవో ఆఫీసుల్లో 12న ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మూడవ దశ ఎన్నికలు జరిగే అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల ఎంపీడీవో ఆఫీసుల్లో ఈ నెల15న ఫెసిలిటేషన్  సెంటర్​ అందుబాటులో ఉంటుందని తెలిపారు.