రాయ్ బరేలీ ప్రజలకు సోనియా ఎమోషనల్ లెటర్

రాయ్ బరేలీ ప్రజలకు సోనియా ఎమోషనల్ లెటర్

న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ ప్రకటించారు. ఆరోగ్య సమస్యలు, వయసు పైబడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గమైన రాయ్ బరేలీ ప్రజలకు సోనియా గురువారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. ‘‘ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, అది మీ వల్లనే. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు నేను ఎల్లప్పుడూ కష్టపడ్డాను. రానున్న లోక్ సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ఇకపై మీకు డైరెక్టుగా సేవ చేసే అవకాశం నాకు ఉండదు. కానీ మీరెప్పుడూ నా హృదయంలోనే ఉంటారు. మీరు గతంలో లాగే భవిష్యత్తులోనూ నాకు, నా కుటుంబానికి అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.

మన బంధం ఏండ్ల నాటిది.. 

రాయ్ బరేలీ ప్రజలతో తన కుటుంబానికి ఎన్నో ఏండ్ల నుంచి అనుబంధం ఉందని సోనియా తెలిపారు. ‘‘ఢిల్లీలో నా కుటుంబం అసంపూర్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది. రాయ్ బరేలీకి వచ్చి మీతో మాట్లాడినప్పుడే అది సంపూర్ణం అవుతుంది. మన బంధం ఎన్నో ఏండ్ల నాటిది. ఈ బంధం మా అత్తామామల నుంచి నాకు అదృష్టంగా లభించింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మా మామ ఫిరోజ్ గాంధీని మీరు గెలిపించారు. ఆ తర్వాత మా అత్త ఇందిరాగాంధీని ఆదరించారు. ఎన్నో కష్టనష్టాలు ఎదురైన టైమ్ లో మాకు అండగా ఉన్నారు. అప్పుడే మన బంధం మరింత బలపడింది. మా అత్త, నా భర్తను కోల్పోయి.. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కున చేర్చుకున్నారు. గత రెండు లోక్ సభ ఎన్నికల్లో మీరు నాకిచ్చిన మద్దతును ఎప్పటికీ మరిచిపోలేను. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను” అని లేఖలో పేర్కొన్నారు. కాగా, రాయ్ బరేలీ నుంచి ఎంపీగా ప్రియాంకగాంధీ పోటీ చేసే అవకాశం ఉంది.