Sonu Nigam: కన్నడిగా కొత్త వివాదం.. పహల్గామ్ వ్యాఖ్యలపై సింగర్ సోను నిగమ్‌పై కేసు

Sonu Nigam: కన్నడిగా కొత్త వివాదం.. పహల్గామ్ వ్యాఖ్యలపై సింగర్ సోను నిగమ్‌పై కేసు

ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ (Sonu Nigam) క్రేజీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కువగా హిందీ సినిమాల్లో పాటలు పాడినప్పటికీ తెలుగు సాంగ్స్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేగాకుండా బెంగాలీ, కన్నడ, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీ లాంటి అనేక భాషల్లో పాటలు పాడుతూ సోను ఎంతో గుర్తింపు పొందాడు.

లేటెస్ట్గా ఈ వెర్సటైల్ సింగర్ సోను ఇచ్చిన కాన్సర్ట్ వివాదంగా మారింది. బెంగళూరులోని విర్గోనగర్‌లోని ఈస్ట్ పాయింట్ కళాశాలలో లైవ్ కచేరీ సందర్భంగా సోనూ మాట్లాడిన తీరుతో చిక్కుల్లో పడ్డారు. ఈ కాన్సర్ట్లో తనను కన్నడలో పాట పాడాలని ఓ అభిమాని సోనూనిగమ్‌ను డిమాండ్ చేశాడు. దీనిపై ఆయన స్పందిస్తూ పహల్గాం విషాదాన్ని ప్రస్తావించారు.

దాంతో కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని, భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ సోను నిగమ్‌పై అవలహల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కర్ణాటక రక్షణ వేదిక (KRV)బెంగళూరు నగర జిల్లా అధ్యక్షుడు, సింగర్ సోను నిగమ్‌పై ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 352(1), 352(2), మరియు 353 సెక్షన్ల కింద అధికారిక ఫిర్యాదు నమోదైంది. 

అసలేం జరిగిందంటే:

ఇటీవలే బెంగళూరులోని విర్గోనగర్‌లోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన లైవ్ కచేరీలో సింగర్ సోను నిగమ్ పాల్గొన్నాడు. అక్కడ ఓ విద్యార్థి కన్నడలో పాటలు పాడమని సోనూనిగమ్‌ను డిమాండ్ చేశాడు. దాంతో తన సహనాన్ని కోల్పోయి.. తన ప్రదర్శనను ఆపి, “పహల్గామ్‌లో జరిగిన సంఘటన వెనుక ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగా ఆ దాడి జరిగింది. డిమాండ్‌ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి" అంటూ తన అసహనం వ్యక్తం చేశాడు.

అయితే, కన్నడలో పాట పాడాలనే సాధారణ అభ్యర్థనను ఉగ్రవాద చర్యతో ముడిపెట్టడం మంచిదికాదంటూ ఫిర్యాదు చేశారు. ఇక ఇదే వేదికపై సోనూ కన్నడ భాషపై ఉన్న అభిమానాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఎక్కువగా పాటలు పాడింది కన్నడలోనే అని భాషలోనే అని, నేను బెంగుళూరు వచ్చినప్పుడల్లా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తారని, ఎన్నో ప్రదర్శనలు ఇక్కడ చేశానని చెప్పుకొచ్చారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో అని తన ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. 

ఇటీవలే జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అందరినీ కలిచివేసింది. మంగళవారం (2025 ఏప్రిల్ 22న) అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు బలయ్యారు. అయితే, ఇక్కడ భాషను ప్రస్తావిస్తూ, టూరిస్టుల పేర్లను అడిగి ఉగ్రముష్కరులు దాడి జరిపారు.