Sophie Devine: రెండు దశాబ్దాల ప్రయాణం: వన్డేలకు న్యూజిలాండ్ మహిళా దిగ్గజ ఆల్ రౌండర్ రిటైర్మెంట్

Sophie Devine: రెండు దశాబ్దాల ప్రయాణం: వన్డేలకు న్యూజిలాండ్ మహిళా దిగ్గజ ఆల్ రౌండర్ రిటైర్మెంట్

న్యూజిలాండ్ మహిళా దిగ్గజ క్రికెటర్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు బ్లాక్ క్యాప్స్ కు ప్రాతినిధ్యం వహించిన డివైన్.. తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. ఈ ఏడాది భరత్ వేదికగా జరగబోయే ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం (జూన్ 17) ధృవీకరించింది. 35 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ టీ20 ఫార్మాట్ లో కొనసాగనుంది. 

రిటైర్మెంట్ తర్వాత డివైన్ మాట్లాడుతూ ఇలా చెప్పింది. "నేను వన్డేల నుంచి తప్పుకోవడానికి ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. నా రిటైర్మెంట్ కు మద్దతు తెలిపిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు నా కృతజ్ఞతలు. ప్రస్తుతం న్యూజిలాండ్ యువ జట్టు అద్భుతంగా ఉంది". అని డివైన్ తెలిపింది. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు మహిళల వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఇండియా, శ్రీలంక వన్డే వరల్డ్ కప్ కు సంయుక్తంగా ఆతిధ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో డివైన్ కివీస్ కు కెప్టెన్ గా వ్యవహరించనుంది. 

2006లో 17 ఏళ్ల వయసులో సోఫీ డివైన్ వన్డే క్రికెట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె కివీస్ మహిళా క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. 152 వన్డేల్లో 31.66 సగటుతో 3990 పరుగులు చేసింది. మరో 10 పరుగులు చేస్తే ఆమె 4000 పరుగుల క్లబ్ లోకి చేరుతుంది. న్యూజిలాండ్ ఆల్-టైమ్ వన్డే రన్-స్కోరర్ జాబితాలో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. వన్డే వరల్డ్ కప్ లో అక్టోబర్ 1న ఇండోర్‌లో ఏడుసార్లు ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.