డీటీడీసీ కొరియర్​లో.. గంజాయి ట్రాన్స్ పోర్టు

డీటీడీసీ కొరియర్​లో.. గంజాయి ట్రాన్స్ పోర్టు
  • ఒడిశా నుంచి తెప్పించుకుని మహారాష్ట్రకు సప్లయ్
  • ఇద్దరు అరెస్ట్.. రూ.30 లక్షల విలువైన 90 కిలోల సరకు స్వాధీనం 

గచ్చిబౌలి, వెలుగు: ఒడిశా నుంచి కొరియర్​లో గంజాయిని తెప్పించుకుని దాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్​వోటీ, చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను శనివారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో మాదాపూర్ ఏడీసీపీ నర్సింహా రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రాయికోడుకు చెందిన నాదారి లింగం(25), గుర్జువాడ గ్రామానికి చెందిన సన్నపు రాజు(29) డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఒడిశాకు చెందిన చంద్రశేఖర్ నుంచి గంజాయిని కొని సిటీ మీదుగా మహారాష్ట్రకు తరలించి అమ్మేవారు. అయితే, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు లింగం, రాజు ఓ ప్లాన్ వేశారు. డీటీడీసీ కొరియర్ ద్వారా గంజాయిని తెప్పించుకోవడం మొదలుపెట్టారు. చంద్రశేఖర్ స్థానిక డీటీడీసీ కొరియర్ బాయ్ సాయంతో ఒడిశా నుంచి ఆరు బాక్సుల్లో గంజాయిని చందానగర్​లోని డీటీడీసీ బ్రాంచ్​కు పంపించాడు. లింగం, రాజు చందానగర్ బ్రాంచ్​కు వెళ్లి ఆరు బాక్సుల డెలివరీని తీసుకున్నారు. 

ఇందులో కొంత గంజాయిని సిటీలో అమ్మాలనుకున్నారు. మిగతా సరుకును మహారాష్ట్రలోని పుణేకు తరలించి సునీల్ అనే వ్యక్తికి అమ్మాలనుకున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం కారులో గంజాయితో పుణేకు బయలుదేరారు. దీని గురించి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్​వోటీ, చందానగర్ పోలీసులు.. శేరిలింగంపల్లిలోని గుల్మోహర్ కాలనీ సిగ్నల్ వద్ద కారును పట్టుకున్నారు. లింగం, రాజును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన 90 కిలోల ఎండు గంజాయి, కారు, 4 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు. సునీల్, చంద్రశేఖర్ పరారీలో ఉన్నట్లు ఏడీసీపీ నర్సింహా రెడ్డి తెలిపారు. లింగం, రాజు గతంలో గంజాయి ట్రాన్స్​పోర్టు కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు ఆయన చెప్పారు.