‘దాదా’గిరి తొందర్లోనే ముగియనుంది.

‘దాదా’గిరి తొందర్లోనే ముగియనుంది.

ముంబై:   బీసీసీఐలో  ‘దాదా’గిరి తొందర్లోనే ముగియనుంది. బోర్డు ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌ గంగూలీ మరో టర్మ్​ ఆ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ నెల 18న జరిగే బీసీసీఐ ఎన్నికల్లో దాదా పోటీపడబోడని సమాచారం. గంగూలీ  స్థానంలో ఇండియా మాజీ క్రికెటర్‌‌, 1983 ప్రపంచ కప్ హీరో రోజర్ బిన్నీ  బీసీసీఐ పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. సౌరవ్‌‌ గంగూలీ ఐసీసీ చైర్మన్‌‌ పోస్టుకు పోటీ పడబోతున్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్‌‌గా, మాజీ సెలెక్టర్‌‌ రోజర్‌‌ బిన్నీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.  బీసీసీఐ ఎలక్షన్స్‌‌,  ఏజీఎంలో పాల్గొనేందుకు 38 స్టేట్‌‌ అసోసియేషన్లలో 35  సంఘాలు తమ ప్రతినిధులను ప్రకటించాయి. ఈ మేరకు  ఎలక్టోరల్‌‌ డ్రాఫ్ట్​ను బోర్డు తన వెబ్‌‌సైట్​లో పెట్టింది.  ఇందులో కర్నాటక స్టేట్‌‌ అసోసియేషన్‌‌  (కేఎస్‌‌సీఏ) ప్రతినిధిగా ఆ సంఘం ప్రెసిడెంట్‌‌ రోజర్‌‌ బిన్నీ పేరు ఉండటంతో  అతను ప్రెసిడెంట్‌‌ బరిలో నిలుస్తాడన్న వార్తలు మొదలయ్యాయి. గతంలో కర్నాటకకు ఆ స్టేట్‌‌ సెక్రటరీ సంతోష్‌‌ మేనన్‌‌ ప్రాతినిథ్యం వహించారు. ఉన్నట్టుండి రోజర్‌‌ను ప్రతినిధిగా నామినేట్‌‌ చేయడంతో అతను బోర్డు ఎన్నికల్లో బరిలో నిలుస్తాడని తెలుస్తోంది. 

దీనికి బలం చేకూర్చేలా  బీసీసీఐ ప్రస్తుత ఆఫీస్‌‌ బేరర్లు, వెటరన్‌‌ అడ్మినిస్ట్రేటర్లు  గురువారం రాత్రి ఢిల్లీలో సమావేశం అయ్యారు.  గంగూలీతో పాటు సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్‌‌ అరుణ్ ల్ తో పాటు బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ హాజరైన ఈ భేటీలో వచ్చే ఏజీఎంలో అనుసరించే వ్యూహాలు, ఎన్నికల్లో  నూతన ఆఫీస్ బేరర్ల పోస్టులపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం అంతా సాఫీగానే ఉందని, కేంద్ర క్యాబినెట్‌‌లో  కీలక మంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఐసీసీ చైర్మన్‌‌ పదవి కోసం బీసీసీఐ నుంచి గంగూలీని పోటీకి దింపవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ఐసీసీ చైర్మన్‌‌ పోస్టుకు నామినేషన్లు దాఖలు చేయడానికి  ఈనెల 20 చివరి తేదీ. ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ బోర్డు సమావేశాల సందర్భంగా నవంబర్‌‌ 11–13 మధ్య ఓటింగ్​ జరిగే అవకాశం ఉంది.అదే సమయంలో  బీసీసీఐ సెక్రటరీగా జై షా మరో పర్యాయం కొనసాగడం ఖాయమే అని తెలుస్తోంది.  బోర్డు ఏజీఎంలో క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ బెంగాల్‌‌ (క్యాబ్‌‌) తరఫున క్యాబ్​ అధ్యక్షుడు అవిషేక్‌‌ దాల్మియా బదులు గంగూలీ ప్రాతినిధ్యం వహించడం మరో ఆసక్తికర విషయం. దాంతో, ఐసీసీ మాజీ ప్రెసిడెంట్‌‌ జగ్‌‌మోహన్‌‌ దాల్మియా కొడుకు అయిన అవిషేక్‌‌   బీసీసీఐలో  ఈసారి కూడా ఎలాంటి పదవి చేపట్టే అవకాశం లేకుండా పోయింది.  

హెచ్‌‌సీఏ ప్రతినిధిగా అజర్‌‌

బీసీసీఐ ఏజీఎంలో హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) ప్రతినిధిగా మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ వ్యవహరిస్తాడు. హెచ్‌‌సీఏ ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ముగిసింది. అయినా సభ్యులు అజర్‌‌ను తమ ప్రతినిధిగా ఎంపిక చేశారు. కాగా, ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌లో ముఖ్యమైన వ్యక్తుల్లో జై షా (గుజరాత్‌‌),  అరుణ్ ధుమాల్ (హిమాచల్ ప్రదేశ్), రాజీవ్ శుక్లా (యూపీ), బీసీసీఐ మాజీ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి (హర్యానా) ఉన్నారు.  కాగా,  ఈనెల 18న బీసీసీఐ ప్రెసిడెంట్‌‌, సెక్రటరీ, ట్రెజరర్‌‌, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌, జాయింట్‌‌ సెక్రటరీ, కౌన్సిలర్‌‌ పోస్టులకు ఎన్నికలు జరుగుతాయి. ఎలక్షన్‌‌ షెడ్యూల్‌‌ ప్రకారం  ఈనెల 11, 12వ తేదీల్లో నామినేషన్లు వేయవచ్చు. 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 14వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు.